తుమ్మపాల: కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ విజయ కృష్ణన్ అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి, జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను ఆయా శాఖల అధికారులు వ్యక్తిగతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరించాలన్నారు. ప్రతి శాఖ అధికారి వారి శాఖకు సంబంధించిన అర్జీల పరిష్కార పరిస్థితిని రోజూ పర్యవేక్షణ చేసి నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలన్నారు. సమర్పించిన అర్జీల సమాచారం కోసం అర్జీదారులు టోల్ ఫ్రీ నంబరు 1100 కాల్ చేసి తెలుసుకోవచ్చని అర్జీదారులకు సూచించారు. ఈ వారం మొత్తం 344 అర్జీలు నమోదు కాగా, వాటిలో 188 అర్జీలు రెవెన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పరిష్కారం కానివే ఉండటం గమనార్హం.
ఆర్.కొత్తూరు గ్రామాన్ని నాతవరంలో విలీనం చేయాలని ధర్నా
అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొయ్యూరు మండలం ఆర్.కొత్తూరు గ్రామాన్ని అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద గ్రామస్తులు నిరసన చేశారు. కొయ్యూరు గిరిజన మండలంలో గిరిజనేతరులు ఉన్న ఆర్.కొత్తూరు గ్రామాన్ని చేర్చడంతో తమ భూములకు ప్రభుత్వం ఎటువంటి పథకాలు అమలు చేయడం లేదని వాపోయారు. దాంతోపాటు సమీపంలో నాతవరం మండల కేంద్రాన్ని దాటుకుని అత్యధిక దూరంలో కొయ్యూరుకు చేరుకోవాల్సి వస్తుందని, తమ ఆవేదనను అధికారులు అర్థం చేసుకుని ప్రభుత్వానికి నివేదించి న్యాయం చేయాలని కోరారు.
శ్మశాన వాటిక ఆక్రమణపై గవరవరం గ్రామస్తుల నిరసన
శ్మశాన వాటికను ఆక్రమిస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ సర్పంచ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చోడవరం మండలం గవరవరం గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. గ్రామంలో ఎనిమిది కులాల వారికి సర్వే నంబరు 111–8లో 1.23 ఎకరాల శ్మశాన వాటిక ఉందన్నారు. గతంలో కొంత స్థలం ఆక్రమణకు గురి కాగా, కోర్టు ఆదేశాలతో 80 సెంట్ల భూమి ప్రస్తుతం శ్మశానవాటికగా ఉందని, దాన్ని కూడా మాజీ సర్పంచ్ వెంకటస్వామినాయుడు ఆక్రమిస్తున్నారని, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా పరిష్కారం లేకపోవడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని గ్రామస్తులు తెలిపారు.
క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీలు పరిష్కరించాలి
క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీలు పరిష్కరించాలి