
కూటమి పార్టీల్లో ఫ్లెక్సీల లొల్లి
నక్కపల్లి : కూటమి పార్టీల్లో ఫ్లెక్సీల లొల్లి రాజుకుంది. హోంమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో అందరి ఫొటోలు వేసి తమ పార్టీ నాయకుడు గెడ్డం బుజ్జి ఫొటో వేయకపోవడం పట్ల జనసేన కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సోషల్‌మీడియా వేదికగా టీడీపీ వైఖరిపై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. ముందుంది ముసళ్ల పండగ రాబోయే ఎన్నికల్లో జనసైనికుల సత్తా ఏంటో చూపిస్తామంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశమయింది. వివరాల్లోకి వెళ్తే ఆదివారం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేట మండలం పెంటకోటలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు రుణాలు పంపిణీ చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వెనుక టీడీపీ నాయకులు పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో జిల్లా, నియోజకవర్గానికి చెందిన కూటమి నాయకులందరి ఫొటోలు వేశారు. నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి గెడ్డం బుజ్జి ఫొటో వేయలేదు. మిగిలిన చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కూడా బుజ్జి ఫొటో వేయకపోవడాన్ని జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. కొంతమంది జనసేన కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించినట్టు తెలిసింది. అంతటితో ఆగకుండా ఫేస్‌బుక్, వాట్సాప్‌గ్రూపులు, ఇన్‌స్టాల్లో టీడీపీ నాయకుల వైఖరిని ఎండ గడుతున్నారు. మంత్రి అనితతో పాటు పలువురు టీడీపీ నాయకుల పేజ్‌లను ట్యాగ్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. నియోజకవర్గంలో జనసేన, బీజేపీలకు టీడీపీ వాళ్లు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నది ఆ రెండు పార్టీల కార్యకర్తల్లో ఆవేదన నెలకొంది. కొద్దిరోజుల క్రితం ఎస్.రాయవరం మండలంలో జనసేన పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడి ఇంటికి కుళాయి ఇవ్వకుండా అక్కడ టీడీపీ సర్పంచ్ అడ్డుకున్నాడు. నిలదీసిన జనసేన నాయకుడిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, జనసేన నాయకులు బాధితుడికి అండగా నిలిచారు. పట్టుబట్టి కుళాయి వేయించారు. తాజాగా నియోజకవర్గ సీనియర్ నాయకుడి ఫొటో వేయకుండా కావాలనే అవమానించారంటూ రగిలిపోతున్నారు.