
జీడి పిక్కల అక్రమ నిల్వలపై కొరడా
నాతవరం:
జీడి పిక్కల అక్రమ నిల్వలపై వ్యవసాయ మార్కెట్ శాఖ జాయింట్ డైరెక్టర్ సుధాకర్ కొరడా ఝుళిపించారు. ఆయన సోమవారం నాతవరం గ్రామంలోని జీడి పిక్కల గొడౌన్లపై సోమవారం ఆకస్మికంగా దాడులు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మార్కెట్ సెస్ చెల్లించకుండా వ్యాపారులు రెండు చోట్ల నిల్వ చేసిన జీడి పిక్కల బస్తాలను గుర్తించారు. ఒక చోట 140 క్వింటాళ్లు, మరో చోట 90 క్వింటాళ్లు జీడిపిక్కల బస్తాలు మార్కెట్ పన్నులు చెల్లించకుండా అక్రమంగా నిల్వ చేసినట్టు నిర్ధారించారు. అలాగే జీడి పిక్కలు వ్యాపారం చేసే వారికి లైసెన్స్ సైతం లేదని తెలుసుకున్నారు. 140 క్వింటాళ్లకు రూ,19,500 మార్కెట్ పన్ను విధించగా.. వ్యాపారికి లైసెన్సు లేకపోవడంతో లైసెన్సు ఫీజు కింద మరో రూ.5,100 జరిమానా విధించామని సుధాకర్ తెలిపారు. 90 క్వింటాళ్ల జీడి పిక్కలకు మార్కెట్ పన్ను రూ.9వేలు, వ్యాపారికి లైసెన్స్ ఫీజు కోసం రూ.5100 జరిమానా విధించామన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యాపారం చేసే ప్రతి వ్యక్తి లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. జీడి పిక్కల అక్రమ నిల్వలపై ప్రత్యేక నిఘా పెట్టాలని నర్సీపట్నం మార్కెట్ కమిటీ సెక్రటరీ భువనేశ్వరికి ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి, పాయకరావుపేట, మాడుగులు, చోడవరం మార్కెట్ కమిటీల సెక్రటరీలతో పాటు నర్సీపట్నం మార్కెట్ కమిటీ సిబ్బంది, స్థానిక ఆర్‌ఐ నాగరా,జు వీఆర్వో బాబు, పోలీసులు పాల్గొన్నారు.