
స్వాతంత్య్ర చరిత్రకు ఆనవాళ్లు.. ఈ స్థూపాలు
చోడవరం: బ్రిటిష్ పాలనలో చోడవరానికి ఒక ప్రత్యేక స్థానమే ఉంది. ఒక పక్క మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు స్వాతంత్య్రం ఉద్యమం చేసే రోజుల్లో ఈ ప్రాంతం నుంచి అనేక మంది భాగస్వామ్యమై వందేమాతరం అంటూ అడుగులో అడుగు వేయగా.. మరో పక్క హార్డింజ్ అనే బ్రిటిష్ గవర్నర్ చోడవరం కేంద్రంగా చేసుకుని ఈ ప్రాంతంలో పన్నులు వసూలు చేశారు. ఆ బ్రిటిష్ అధికారి విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ ఓ గెస్ట్ హౌస్ కూడా అప్పట్లో నిర్మించారు. అదే చోడవరం హార్డింజ్ గెస్ట్ హౌస్. నాటి చరిత్రకు నేటికీ సాక్ష్యాలుగా ఉన్న కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన 1947 ఆగస్టు 15న దేశంలో నిర్మించిన అతి కొద్ది జెండా స్థూపాల్లో ఒకటి చోడవరంలో ఉంది. ఎందరో మహనీయుల పోరాట ఫలితంగా వచ్చిన స్వాతంత్య్రానికి ఈ జెండా స్థూపాలే నిలువెత్తు నిదర్శనం.
స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు కావస్తున్నా నాటి జెండా స్థూపాలు అమరవీరుల త్యాగఫలాన్ని నేటి తరానికి గుర్తు చేస్తూనే ఉన్నాయి. బ్రిటిష్ కాలం నుంచి నేటి భారతం వరకు ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న చోడవరంలో ఉన్న రెండు జెండా స్థూపాలకు ఎంతో చరిత్ర ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ప్రకటించిన క్షణమే దేశ వ్యాప్తంగా మువన్నెల జెండా ఎగురవేసేందుకు పలు చోట్ల రాత్రికి రాత్రే సంబరాల నడుమ జెండా స్థూపాలను నిర్మించారు. ఆప్పుడు నిర్మించిన జెండా స్థూపాల్లో చోడవరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్మించిన స్థూపం ఒకటి. ఈ జెండా స్థూపానికి నేటికి 77 ఏళ్లు. బ్రిటిషు ప్రభుత్వంలో అప్పటి ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన డి.రామదాసు ఈ జెండా స్థూపాన్ని నిర్మించి మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. తుప్పుపట్టని మిశ్రమ లోహంతో తయారు చేసిన ఇనుప గొట్టంతో ఈ జెండా దిమ్మను నిర్మించారు. అందుకే ఈ స్థూపం ఎన్ని దశాబ్దాలైనా చెక్కుచెదరలేదు.
హార్డింజ్ గెస్ట్ హౌస్ వద్ద బ్రిటిష్ జెండా ఎగిరేందుకు గెస్ట్ హౌస్ బంగ్లాకు ఎదురుగా ఒక స్థూపాన్ని నిర్మించి దాని చుట్టూ ఒక వృత్తాకారంలో దిమ్మను కట్టారు. ఆ స్థూపం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. తెల్లదొరలు దేశాన్ని వదిలివెళ్లిపోయారని తెలిసిన వెంటనే ఈ స్థూపంపై బ్రిటిష్ జెండాను దించి భారతీయ మువ్వన్నెల జెండాను అప్పటి స్థానికులు ఎగురవేశారు. సుమారు వందేళ్ల కిందట నిర్మించిన ఈ స్థూపం చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. ఈ రెండు స్థూపాలు స్వాత్రంత్య ఉద్యమానికి ఆనవాళ్లుగా ఈ ప్రాంతంలో ఉన్నాయి. హార్డింజ్ గెస్ట్‌హౌస్‌లో ఇటీవల మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ రెండు చోట్ల ఈ నెల 15న స్వాతంత్య్ర వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

స్వాతంత్య్ర చరిత్రకు ఆనవాళ్లు.. ఈ స్థూపాలు