
ఓటు చోరీపై ప్రజలకు సమాధానం చెప్పండి
నిరసన వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు
బీచ్‌రోడ్డు: ‘మా ఓటు భద్రం.. చోరీ కానివ్వకండి’.. ‘ఓటు చోరీపై ప్రజలకు సమాధానం చెప్పండి’, ‘బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ఆపండి’అని విదసం నాయకులు డిమాండ్ చేశారు. విస్తృత దళిత సంఘాల (విదసం) ఐక్య వేదిక రాష్ట్ర సమితి కన్వీనర్ డా.బూసి వెంకట రావు ఆధ్వర్యంలో గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన భారత ఎన్నికల కమిషనర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ప్రతి పౌరుడికి ఒకే ఓటు, ఒకే విలువ ఉండగా.. దేశంలో ఇటీవల జరుగుతున్న ఓట్ల చోరీపై ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. బీహార్‌లో ఎస్‌ఐఆర్, కర్ణాటకలోని మహాదేవపురలో జరిగిన ఓట్ల మాయాజాలంపై ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన ఎన్నికల సంఘం.. ప్రశ్నించిన వారినే నిందిస్తోందని ఆయన విమర్శించారు. బీహార్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగించడానికే ప్రత్యేక సమగ్ర సవరణ చేపడుతున్నారని, ఇది ఎన్నికల సంఘానికి రాజ్యాంగం కల్పించిన స్వయం నిర్ణయాధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆరోపించారు. మహాదేవపుర ఎంపీ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో బయటపడ్డ వేలాది నకిలీ ఓటర్లపై సమగ్ర విచారణ జరిపి, ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విదసం నేతలు సోడా దాసి సుధాకర్, గుడివాడ ప్రసాద్, బూల భాస్కరరావు, డి.నిర్మల, ఫ్రాన్సిస్, ఉత్తరాంధ్ర రాజ్యాంగ హక్కుల నేత బాగం గోపాల్, బనాస అధ్యక్షుడు టి.శ్రీరామ్ మూర్తి, పట్టా రామప్పారావు పాల్గొన్నారు.