
కళా రంగానికి పుట్టినిల్లు మునగపాక
మునగపాక : నేటి యుగంలో కళారంగానికి పుట్టినిల్లుగా మునగపాక రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ పేర్కొన్నారు. ఏటా నాటిక పరిషత్‌లు నిర్వహిస్తూ ఎంతో మంది కళాకారులను ప్రోత్సహిస్తున్న గ్రామీణ యువజన మందిరం సేవలు మరువరానివన్నారు. మునగపాక నందీశ్వర కళా ప్రాంగణం తులసీ కళావేదికపై గ్రామీణ యువజన మందిరం 61వ వార్షికోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఉమ్మడి విశాఖ జిల్లా అహ్వాన నాటిక ప్రదర్శనలను ఆయన గురువారం రాత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్దిన ఘనత గ్రామీణ యువజన మందిరానికే దక్కుతుందన్నారు గ్రామీణ యువజన మందిరం అధ్యక్షుడు ఆడారి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ జెడ్‌పీటీసీ మళ్ల సంజీవరావు, పెద్దలు కాండ్రేగుల జగ్గారావు, పెంటకోట సత్యనారాయణ, కోనపల్లి రామ్మోహనరావు, అలంక ప్రకాశరావు, యువజన మందిరం కార్యవర్గ సభ్యులు మళ్ల జోగారావు, మళ్ల రామజోగినాయుడు, ఆడారి లక్ష్మణరావు, ఆడారి సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రంగస్థల కళాకారులు కాండ్రేగుల జగ్గారావును సత్కరించారు.
ఆకట్టుకున్న నాటిక ప్రదర్శనలు
ఉమ్మడి విశాఖ జిల్లా ఆహ్వాన నాటిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. పెందుర్తికి చెందిన శ్రీగౌరీ నటరాజా డ్రమాటిక్ అసోసియేషన్ వారి చీమా..చీమా..ఎందుకు కుట్టావ్, మాతృదేవోభవ నాటికలు అలరించాయి. నాటిక ప్రదర్శనలను కళాభిమానులు పెద్ద సంఖ్యలో తిలకించారు.

కళా రంగానికి పుట్టినిల్లు మునగపాక