
ఈ డోలీమోతలు ఇంకెన్నాళ్లు!
నర్సీపట్నం : గ్రామానికి రహదారి నిర్మించాలంటూ గొలుగొండ మండలం, డొంకాడ గిరిజనులు అబిద్‌సెంటర్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు డోలీ యాత్ర నిర్వహించారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.గోవిందరావు మాట్లాడుతూ డొంకాడ గ్రామంలో కొందు గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నారన్నారు. జీవో నెంబరు 726 ఇంపాక్ట్ నిధుల నుంచి పంచాయతీకి 2023లో నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఫారెస్ట్ క్లియరెన్స్ పూర్తయినప్పటికీ నేటికి అధికారులు రోడ్డు పనులు మొదలు పెట్టలేదన్నారు. రహదారి సౌకర్యం లేక డోలీ మోతతో వైద్యం కోసం గర్భిణులు పాంగి మువ్వల, కొండ తామల జ్యోతి, సీత మార్గం మధ్యలో మరణించడం జరిగిందన్నారు. గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, స్కూల్ లేక కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందన్నారు. చందాలు వేసుకుని నడవడానికి వీలుగా గ్రామస్తులే రోడ్డు వేసుకుంటున్నారన్నారు. డొంకాడతో పాటు పిత్రిగడ్డ, నీళ్లు బంద, పెద్ద గరువు గ్రామాలకు రోడ్లు లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారన్నారు. తక్షణమే అధికారులు డొంకాడ గ్రామానికి రోడ్డు వేయాలని లేని పక్షంలో పంచాయతీ కార్యాలయం ముందు నిరసనకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో ఎవో, పీఆర్ కార్యాలయంలో వినతిపత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో తాంబలి సత్తిబాబు, గేమిల సుబ్బారావు, తాంబూలా అప్పారావు, సీఐటీయు జిల్లా కార్యదర్శి రాజు పాల్గొన్నారు.