
ఎస్పీ కార్యాలయానికి 35 అర్జీలు
అర్జీదారుల సమస్యను వింటున్న ఎస్పీ
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయానికి పీజీఆర్‌ఎస్‌కు సోమవారం 35 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూతగాదాలు–25, కుటుంబ కలహాలు–4, మోసాలకు సంబంధించినవి–2, వివిధ విభాగాలకు చెందినవి–4 అర్జీలు అందాయి. చట్ట పరిధిలో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్‌రావు, ఎస్‌ఐ వెంకన్న, అర్జీదారులు పాల్గొన్నారు.
జిల్లా సమాచార శాఖ వాహనానికి బహిరంగ వేలం
తుమ్మపాల: జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వీడియో కవరేజ్ వాహనానికి ఈ నెల 21వ ఉదయం 11 గంటలకు కార్యాలయ ప్రాంగణంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్టు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎస్.వి. రమణ తెలిపారు. కాలపరిమితి ముగిసి, నిరుపయోగంగా ఉన్న మహీంద్రా నిస్సాన్ (ఏపి31 టి5083, 1993 మోడల్) వాహనాన్ని బహిరంగ వేలం వేసేందుకు నిర్ణయించామని పేర్కొన్నారు. వేలంలో పాల్గొనదలచిన వారు రూ.1,000 ధరావతు సొమ్ము చెల్లించవలసి ఉంటుందని, వేలం దక్కించుకున్న వారు జీఎస్టీతో సహా మొత్తం నగదు వెంటనే చెల్లించాలని తెలిపారు. వాహనాన్ని కార్యాలయ పని వేళల్లో పరిశీలించవచ్చని, వేలం వేయడం, రద్దు చేసే అధికారం కార్యాలయ అధికారికి ఉందని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెం.9100442488 కు సంప్రదించాలని కోరారు.
విస్తృతంగా ‘జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్’
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలోని ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలు, పార్కులు, రిజర్వ్ ప్రదేశాలు, ఇతర ప్రజా ఆస్తులను పరిరక్షించడం చాలా ముఖ్యమని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ ఆస్తులపై హక్కులు పూర్తిగా ప్రభుత్వం, జీవీఎంసీకే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినా, ఆక్రమణకు ప్రయత్నించినా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు నగరంలో ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం జీవీఎంసీ ‘ఆపరేషన్ లంగ్స్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని విస్తృతం చేసిందని కమిషనర్ తెలిపారు.