
మండల కేంద్రాల్లో వాలీబాల్ కోర్ట్‌ల ఏర్పాటుకు చర్యలు
జిల్లా క్రీడా అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశం
తుమ్మపాల: మండల ప్రధాన కేంద్రాల్లో వాలీబాల్ కోర్ట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సంబంధిత అధికారులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి జిల్లా క్రీడా అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించి, మంచి క్రీడాకారులను తయారు చేయాలన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభిస్తే అద్భుతంగా రాణిస్తారన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన, క్రీడాస్ఫూర్తి అలవడుతుందన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో 2 అవుట్ డోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఆమోదం చేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో 50 సెంట్లలో భూమిని సేకరించి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం మోడల్‌లో స్విమ్మింగ్ ఫుల్‌కు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. మండల కేంద్రాల్లో 20 సెంట్లలో భూమిని సేకరించి వాలీబాల్ కోర్ట్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో పికెల్ బాల్ కోర్టు ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించి కొలతలు, నిధుల వివరాలు సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎల్.వెంకటరమణ, జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి సందీప్, జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి మంజులవాణి, డ్వామా పీడీ పూర్ణిమాదేవి, యలమంచిలి, అనకాపల్లి మునిసిపల్ కమిషనర్లు, ఏపీఐఐసీ డిప్యూటీ మేనేజర్ రాజశేఖర్, సమగ్ర శిక్ష కార్యనిర్వాహక ఇంజినీర్ నరసింహమూర్తి పాల్గొన్నారు.