
పైడమ్మ చెరువును వదిలేయండి సారూ...!
వాడనర్సాపురం వాసుల వేడుకోలు
చెరువు చుట్టూ ఫెన్సింగ్ పనులు నిలిపివేయాలని వినతి
నేడు నేవల్ బేస్ అధికారులతో గ్రామస్తుల చర్చలు..?
ఇదీ నేపథ్యం...
రాంబిల్లి(అచ్యుతాపురం): తీర ప్రాంత గ్రామాలు ఒక్కొక్కటిగా తమ ఉనికి కోల్పోతూ స్థానిక మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం చూపుతున్న వేళ రాంబిల్లి మండలంలోని వాడనర్సాపురం వాసులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. గ్రామానికి ఆనుకొని ఉన్న 130 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పైడమ్మ చెరువును కాపాడుకొనేందుకు నానా అవస్థలు పడుతున్నారు. పరిశ్రమలు, జాతీయ స్థాయిలోని పరిశోధన కేంద్రాలకు భూములు తీసుకున్నప్పుడు ఒక విధంగా స్పందించిన అధికారులు కాగితాల్లో కనిపించే నిబంధనలను అమలు చేస్తూ ఏ మాత్రం అక్షర జ్ఞానం లేని గంగ పుత్రుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. నావికా దళం కోసం చేపడుతున్న నిర్మాణాల్లో భాగంగా ఇప్పటికే సముద్రంపై పట్టు కోల్పోయి వేట కోసం తెలంగాణ పరిధిలోని నాగార్జున సాగర్ ఆయకట్టు కాల్వలకు వలస పోతుండగా, మిగిలిన వారికి కాస్తో కూస్తో ఆధారంగా ఉన్న చెరువు విషయంలోనూ ఇపుడు ఆందోళనకు గురవుతున్నారు.
ఊరు తరలించే వరకూ ఆంక్షలొద్దు...
ఉపాధి లేక వలస బాట పట్టిన వాడనర్సాపురం వాసులకు 130 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పైడమ్మ చెరువు కాస్తో కూస్తో ఊరటనిస్తుంది. దీనిలో 30 ఎకరాలు పోగా ఉన్న వంద ఎకరాల చెరువు వినియోగం విషయంలోనైనా గ్రామం తరలించే వరకూ ఆంక్షలు విధించొద్దని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఒక వైపు సముద్రంలో ఆంక్షలు, మరోవైపు పరిశ్రమల వల్ల తీరాల్లో తగ్గిన మత్స్య సంపద కారణంగా చెరువులే తమకు అండగా నిలుస్తున్నాయని చెబుతున్నారు.
ఫెన్సింగ్ పనుల అడ్డగింత
నేవల్ బేస్‌కి సంబంధించి డీజీఎన్‌పీ (ఏజీ) పాత్రుడు ఆధ్వర్యంలో సోమవారం పైడమ్మ చెరువు వద్ద ఫెన్సింగ్ పనులు ప్రారంభిస్తారని తెలుసుకున్న వాడనర్సాపురం వాసులు చర్చలు జరిపారు. ముందుగా అధికారులు ఇచ్చిన హామీ మేరకు గ్రామాన్ని తరలించిన తర్వాతే చెరువు ఫెన్సింగ్ పనులు చెపట్టాలని, పంచాయతీ ఆమోదం లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా రెవెన్యూ యంత్రాంగం ఈ చెరువుని నేవల్ అధికారులకు ఎలా అప్పగిస్తుందని వారు ప్రశ్నించారు. చర్చల్లో రామారావు, చింతకాయల ఎర్రయ్య, కొవిరి సోమేశ్వరరావు, కారే రాముడు, సూరాడ అప్పలరాజు, వాసుపల్లి సూరిబాబు, మైలపల్లి లోవరాజులు డీజీఎన్‌పీ ప్రతినిధికి వినతి పత్రం అందజేశారు.
వాడనర్సాపురం వాసుల వేడుకోలు
చెరువు చుట్టూ ఫెన్సింగ్ పనులు నిలిపివేయాలని వినతి
నేడు నేవల్ బేస్ అధికారులతో గ్రామస్తుల చర్చలు..?
రాంబిల్లి మండలంలోని వాడనర్సాపురంలో 3700కు పైగా జనాభా ఉన్నారు. కూత వేటు దూరంలో సముద్రం ఉంది. మరో కిలోమీటర్ దూరంలో శారదా నది ఉంది. 2005లో నేవల్ బేస్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 2008 నుంచి పరిహారం ఇవ్వడం ప్రారంభించారు. అప్పట్లో భూమికి రూ.3లక్షలు చొప్పున పరిహారం, వృత్తి కోల్పోయిన వారికి ప్యాకేజీ కింద లక్ష రూపాయలు చొప్పున ఇచ్చారు. ఒకవైపు సముద్రం, మరోవైపు శారదా నది, దీనికి తోడు పైడమ్మ చెరువుపై ఆధారపడి చేపల వేట చేసే ఇక్కడి మత్స్యకారులకు నేవల్‌బేస్ వచ్చిన తర్వాత పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇప్పటికే 100 కుటుంబాలకు చెందిన వారు శ్రీశైలం, నాగార్జునసాగర్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. తాజాగా పైడమ్మ చెరువుకు ఫెన్సింగ్ వేయాలన్న ప్రతిపాదన మత్స్యకారులకు సమస్యగా మారింది. ఫెన్సింగ్‌కు తాము ఒప్పుకునేది లేదని ఇక్కడ వారు చెప్తున్నారు.

పైడమ్మ చెరువును వదిలేయండి సారూ...!