
కదంతొక్కిన గోవాడ రైతులు
● సుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం ఆదుకోవాలి ● కార్మికులు, రైతుల బకాయిలు చెల్లించాలి ● లేదంటే ఉద్యమం ఉధృతం ● కలెక్టరేట్ వద్ద ఆందోళన
తుమ్మపాల : గోవాడ చెరకు కర్మాగారం దినదిన గండంగా నడుస్తోందని, వచ్చే సీజన్‌లో ఫ్యాక్టరీ నడుపుతారో లేదోననీ రైతులు ఆందోళన చెందుతున్నారని, దీనిపై యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు, కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో రైతు, కార్మిక సంఘాలు సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవాలని, రైతులు, కార్మికులకు గత సీజన్‌లో బకాయి పడ్డ రూ.30 కోట్లు వెంటనే చెల్లించాలని, ఆధునికీకరణకు రూ.100 కోట్లు మంజూరు చేసి రాష్ట్రంలో ఉన్న ఏకై క సహకార షుగర్ ఫ్యాక్టరీ కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9న ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేసిన రైతుల దశల వారి పోరాటంలో భాగంగా కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో రైతు సంఘ నాయకులు తాతారావు, రమణ, ఏరువాక శ్రీనివాసరావు, ఫ్యాక్టరీ కార్మిక రామునాయుడు, సీఐటీయు నాయకులు వి.వి. శ్రీనివాసరావు, గంట శ్రీరామ్, కర్రి అప్పారావు, నాయుడు, గండి నాయనబాబు, రైతులు పాల్గొన్నారు.