
తాండవ నీటిని పొదుపుగా వాడుకోవాలి
● స్పీకర్ అయ్యన్న, హోంమంత్రి అనిత ● తాండువ నీటి విడుదల
నాతవరం : తాండవ రిజర్వాయర్ నీటిని రైతులు వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు. ఖరీఫ్ పంట సాగు కోసం తాండవ నీటిని ఆదివారం స్పీకర్ అయ్యన్న, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అయ్యన్న మాట్లాడుతూ జిల్లాలోనే మేజరు ప్రాజెక్టు అయిన తాండవను మనమంతా కాపాడుకుని, మన తర్వాత తరం వారికి అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తాండవ ప్రాజెక్టు అభివృద్ధికి ఇంత వరకు రూ.8 కోట్లు మంజూరు చేశానన్నారు. తాండవను పూర్తిగా అభివృద్ధి చేసేందుకు మంత్రి నిమ్మల రామానాయుడును ఇటీవల రూ.20కోట్లు అడగగా.. ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. నాతవరం నుంచి తాండవ ప్రాజెక్టు రోడ్డును ఇరిగేషన్ నుంచి ఆర్‌అండ్‌బీకి విలీనం చేశామని, రూ.8 కోట్లతో అభివృద్ధికి ప్రతిపాదనలు చేస్తామన్నారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ తాండవ ప్రాజెక్టును మొదట సారిగా సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాండవ రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపడతామన్నారు. డీఈ అనురాధ మాట్లాడుతూ తాండవలో 372.0 అడుగులు నీరు ఉందని, రోజుకు 500 క్యూసెక్కులు చొప్పున విడుదల చేస్తే 65 రోజులు ప్రవహిస్తుందన్నారు. ప్రస్తుతం కాలువల ద్వారా 100 క్యూసెక్కులు నీటిని విడుదల చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ వైస్ చైర్మన్ జోగుబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, ఈఈ బాల సూర్యం, జేఈ శ్యామ్‌కుమార్, ఆర్డీవో వి.వి.రమణ, స్థానిక నాయకుడు నందిపల్లి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.