
విద్యా రంగ పరిరక్షణే ధ్యేయం
అనకాపల్లి: ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణే ధ్యేయంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చినబ్బాయ్, రాష్ట్ర కౌన్సిలర్ ఈ.ఎల్లయ్యబాబు కోరారు. స్థానిక సీఐటీయూ కార్యాలయం వద్ద యూటీఎఫ్ 52వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వారు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు పాలకులు చూస్తున్నారని, పోరాటాలు చేసే సమయం ఆసన్నమైందన్నారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని ప్రయోగశాలగా చూడకూడదని, ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యా విధానాలు మార్చడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ప్రపంచమంతా శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందుతున్న తరుణంలో, భారతీయ విద్య కూడా పురోభివృద్ధి చెందాలన్నారు. మూఢ నమ్మకాలు, కులతత్వం, ప్రాంతీయతత్వం, మతతత్వాన్ని విడనాడే దిశగా విద్యా సంస్కరణలు ఉండాలని వారు పిలుపునిచ్చారు. సాంకేతిక విద్య, వైద్యం పేద ప్రజలకు అందని ద్రాక్షగా మారాయని, ఉన్నత విద్య అందరూ అభ్యసించే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహ అధ్యక్షుడు రొంగలి అక్కునాయుడు, జిల్లా కార్యదర్శి జి.ఎస్.ప్రకాష్, యూటీఎఫ్ నాయకులు మామిడి బాబురావు, రవి, బండారు శంకర్, ఎం.కె.శ్రీకాంత్, రాము, వెంకటరమణ, ఆశ పాల్గొన్నారు.