
వృద్ధురాలి హత్యకేసులో నిందితుడు అరెస్టు
చీడికాడ : మండలంలోని బోయపాడు(ఎల్.బి.పట్నం)లో శనివారం జరిగిన వృద్ధురాలి హత్య ఘటనలో నిందితుడు పవన్‌సాయిని ఆదివారం అరెస్టు చేసినట్టు కె.కోటపాడు సీఐ పైడపునాయుడు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కుదరా పవన్‌సాయి అనే యువకుడు గంజాయి, మద్యానికి బానిసవగా, కుటుంబసభ్యులు అతడిని విశాఖలో గల మానసిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు. బతుకు తెరువు కోసం ఆ యువకుడి తల్లిదండ్రులు కంచరపాలెం వలసవెళ్లగా యువకుడు వారి వద్దనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు బోయపాడు వచ్చిన పవన్‌సాయి 9వ తేదీ తెల్లవారు జామున బహిర్భూమికి వెళుతున్న వృద్ధురాలు గండి పైడితల్లమ్మపై మద్యం మత్తులో కర్రతో కొట్టి అనంతరం బండరాయితో మోది చంపాడు. దీనిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందుతుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు. ఎస్‌ఐ బి.సతీష్ పాల్గొన్నారు.