
బల్క్‌డ్రగ్ పార్క్‌ను అడ్డుకోవాల్సిందే!
నక్కపల్లి : రాజయ్యపేట సమీపంలో ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్‌పార్క్‌ను అడ్డుకుని తీరాల్సిందేనని మత్స్యకారులు నిర్ణయించారు. ఆదివారం రాజయ్యపేటలో మత్య్సకారులంతా వేటకు విరామం ప్రకటించి సమావేశమయ్యారు. ఈ ప్రాంతంలో బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయొద్దని హోంమంత్రి వంగలపూడి అనిత దృష్టికి తీసుకెళ్లాలని, అప్పటికీ స్పందన లేకపోతే తీరప్రాంత గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఆదివారం రాజయ్యపేటలో సమావేశమయిన పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ బల్క్‌డ్రగ్ పార్క్ పేరుతో రాజయ్యపేట పరిసర ప్రాంత గ్రామాల్లో వందలాది ప్రమాదకర రసాయన పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనిపై ఈనెల 6వ తేదీన నక్కపల్లిలో నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలో మత్స్యకారులు, యాదవ సామాజికవర్గానికి చెందిన వారు వైఎస్సార్‌సీపీ, వామపక్ష పార్టీలతోపాటు కొంతమంది జనసేన నాయకులు సైతం ఈ బల్క్‌డ్రగ్‌పార్క్‌ను తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. అయితే వారిని వేదిక వద్దకు రాకుండా పోలీసుల సాయంతో అడ్డుకున్నారన్నారు. ఇక్కడ ప్రమాదకర పరిశ్రమలు ఏర్పాటయితే రాజయ్యపేట, బోయపాడు, బుచ్చిరాజుపేట, తీనార్ల, తదితర గ్రామాల్లో నివసించేవారు అనేక ప్రాణంతకమైన వ్యాధులతో బాధపడతారన్నారు. బల్క్‌డ్రగ్ పేరుతో వందలాది కంపెనీలు ప్రారంభిస్తే ఈ ప్రాంతమంతా శ్మశానంగా మారుతుందన్నారు. పరిసరాల్లో జీవించడానికి ఎవరూ సాహసం చేయరన్నారు. గ్రామస్తులంతా పార్టీల కతీతంగా ఐకమత్యంగా బల్క్ డ్రగ్ పార్క్‌ను ఎదుర్కొవాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుని ఉద్యమాన్ని ఉధృతం చేయాలని, కేసులకు భయపడే ప్రసక్తి లేదని సమావేశంలో తీర్మానించారు. రసాయన కంపెనీల వల్ల తాము పడే కష్టాలను ప్రజాభిప్రాయసేకరణలో చెప్పుకునే అవకాశం కూడా కల్పించలేదని మత్స్యకారులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
అగ్గి రగిల్చిన టీడీపీ నేత వ్యాఖ్యలు
ప్రజాభిప్రాయసేకరణలో ఒక టీడీపీ నేత కంపెనీకి అనుకూలంగా మాట్లాడుతూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మత్స్యకారులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వల్లే వారు రెచ్చిపోయారన్న ప్రచారం జరుగుతోంది. వేదిక ముందు ఈ నాయకుడు మాట్లాడుతున్న సమయంలో వందలాది మంది మత్స్యకారులు అరుపులు కేకలతో నాయకుడి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. బారికేడ్లు తోసుకుంటూ వేదిక వద్దకు చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకుడి ప్రసంగాన్ని అడ్డుకోకుండా అతనికి వత్తాసు పాడిన రాజయ్యపేటకు చెందిన ఇద్దరు కార్యకర్తలపై గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. కంపెనీకి అనుకూలంగా మత్స్యకారులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన టీడీపీ నాయకుడిని బయటకు వచ్చేక కొంతమంది అడ్డుకుని నిలదీశారు. ‘కంపెనీ మా గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు... నీకేం తెలుసని మాట్లాడుతున్నావ్... నష్టపోయేది మేము... పోయే ప్రాణాలు మావి...మీకేంటి సంబంధం?’ అంటూ నిలదీయడంతో సదరు నాయకుడు నీళ్లు నమిలాడు. రైతులకు ప్యాకేజీ, నష్టపరిహారం హోంమంత్రి వల్లే వచ్చిందంటూ నాయకుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. దీంతో మత్స్యకారులు, వైఎస్సార్‌సీపీ, వామపక్ష నేతలు గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బల్క్ డ్రగ్‌పార్క్ ప్రజాభిప్రాయసేకరణపై ప్రజల్లో నుంచి తీవ్ర వ్యతిరేకత రావడానికి వేదికపై ఒక నాయకుడు రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యలే కారణమని టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఇతని ప్రసంగ వీడియోను అసమ్మతి నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పార్టీ అధిష్టానం అతని వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధిని పార్టీ అధిష్టానం ప్రశ్నించినట్లు బోగట్టా.
రాజయ్యపేట మత్స్యకారుల నిర్ణయం
అవసరమైతే టీడీపీకి మూకుమ్మడి రాజీనామాలు
తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం
త్వరలో కార్యాచరణ ప్రణాళిక

బల్క్‌డ్రగ్ పార్క్‌ను అడ్డుకోవాల్సిందే!