
13న ‘క్విట్ కార్పొరేట్స్’ నిరసన ర్యాలీ
అనకాపల్లి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకిస్తూ ఈనెల 13న క్విట్ కార్పొరేట్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు రైతు సంఘాల నాయకులు తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో పలు రైతు సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా అమెరికా, బ్రిటన్ దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలను చేపడుతుందని, రైతులకు నష్టదాయకంగా జాతీయ వ్యవసాయ మార్కెట్ చట్టా న్ని సవరించే ముసాయిదాను అమలు చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. కార్మిక చట్టాలను కాలరాసే 4 లేబర్ కోడ్‌ల అమలు, ప్రజలపై విద్యుత్ భారం మోపేలా అదానీ స్మార్ట్ మీటర్లను బిగించేందుకు చర్యలు చేపడుతున్నదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీల కోసం వేలాది ఎకరాల భూ సేకరణ చేపడుతూ, సన్న చిన్న కారు రైతులను, దేశ ప్రజలను నిర్వాసితులను చేస్తోందన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ‘క్విట్ ఇండియా‘ ఉద్యమస్ఫూర్తితో ‘క్విట్ కార్పొరేట్స్‘ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా కన్వీ నర్ కర్రి అప్పారావు, రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్) జిల్లా కార్యదర్శి కోన మోహన్ రావు, రైతు స్వరాజ్య వేదిక నాయకులు గాడి బాలు, సీఐటీయు జిల్లా నాయకులు ఆర్.శంకర్ రావు, శ్రీనివాసరావు, ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్ సురేష్ బాబు, ఏపీ రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు పాల్గొన్నారు.
ఈ నిర్లక్ష్యానికి చికిత్స ఏదీ..!

13న ‘క్విట్ కార్పొరేట్స్’ నిరసన ర్యాలీ