
6.5 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
● ఏటికొప్పాక రైల్వేగేటు వద్ద లారీ స్వాధీనం
యలమంచిలి రూరల్: అక్రమంగా లారీలో తరలిస్తున్న సుమారు 6.5 టన్నుల రేషన్ బియ్యాన్ని యలమంచిలి రెవెన్యూ అధికారులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని స్వాధీనపర్చుకున్నారు. వివరాలివి.. యలమంచిలి మండలం పులపర్తి గ్రామంలో వెంకట దుర్గా రైసు మిల్లులో ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన రేషన్ బియ్యం బస్తాల్లో ప్యాక్ చేసి ఏపీ 16 టీవై 4491 రిజిస్ట్రేషన్ నెంబరు గల లారీలో లోడు చేస్తుండగా రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. దీనిని పట్టుకోవడానికి రెవెన్యూ అధికారులు పులపర్తి వెళ్లేసరికి అక్రమార్కులు లారీని అక్కడ్నుంచి ఏటికొప్పాక జగనన్న కాలనీకి తరలించారు. గ్రామస్థులకు అనుమానం వచ్చి కొందరు మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. అనంతరం రెవెన్యూ, పోలీసు అధికారులకు కూడా సమాచారం చేరవేశారు. తహసీల్దార్ వరహాలు ఆదేశాలతో డీటీ వినయ్‌కుమార్, ముగ్గురు వీఆర్వోలు ఏటికొప్పాకకు చేరుకునేసరికి రేషన్ బియ్యంతో ఉన్న లారీని అక్కడ్నుంచి తరలించుకుపోతుండగా ఏటికొప్పాక రైల్వేగేటు వద్ద రెవెన్యూ అధికారులు వాహనాన్ని ఆపి స్వాధీనపర్చుకున్నారు. లారీలో 50 కేజీల బియ్యం ఉన్న 130 బస్తాలు ఉన్నట్టు డిప్యూటీ తహసీల్దార్ వినయ్‌కుమార్ తెలిపారు. నిబంధనల ప్రకారం దీనిపై 6 ఏ కేసు నమోదు చేయనున్నట్టు ఆయన తెలిపారు.

6.5 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత