
2 రోజుల్లో నీడ్ అసెస్‌మెంట్ సర్వే పూర్తి చేయాలి
● ఎరువుల అవసరాలను గుర్తించండి ● కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: బంగారు కుటుంబాల అవసరాలను దత్తత తీసుకున్న మార్గదర్శులు కల్పించేందుకు నిర్దేశించిన నీడ్ అసెస్‌మెంట్ సర్వే ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. పీ 4, ఎరువులు, డాక్యుమెంటేషన్ అప్‌లోడ్, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో ఆమె మాట్లాడుతూ ఎరువుల అవసరాలను ముందుగా గుర్తించాలని, పటిష్ట పర్యవేక్షణ జరపాలన్నారు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ ఆక్టివ్, ఇన్ ఆక్టివ్ ఖాతాల వివరాలు పరిశీలించాలన్నారు. పీ 4లో మార్గదర్శి, బంగారు కుటుంబాల అనుసంధానం, అవసరాల సర్వే అంశాలను పూర్తి చేయాలన్నారు. బంగారు కుటుంబాలను మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఎవరినీ బలవంతం చేయవద్దని స్పష్టం చేశారు. పీ–4పై సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా హేండ్‌బుక్‌ను రూపొందించాలన్నారు. ఇందులో సూచనలు పాటిస్తూ అందరికీ అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీపీవో జి.రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నరసింహరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
షేడ్ నెట్స్‌పై రైతులకు అవగాహన కల్పించాలి
షేడ్ నెట్స్‌పై రైతులకు మండల స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో షెడ్ నెట్స్‌పై ఉద్యానవన, గ్రామీణ అభివృద్ధి, కేతి టెక్ కంపెనీతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలానికి 10 మంది రైతులను గుర్తించి వారి వివరాలను ఈ నెల 18వ తేదీ లోపు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థకు సమర్పించాలన్నారు. షేడ్ నెట్స్ వేసుకున్నట్లయితే చీడ, పీడలు రాకుండా ఉంటాయని, నీరు తక్కువగా అవసరం పడుతుందన్నారు. పంట దిగుబడి 3 రేట్లు అధికంగా వస్తుందన్నారు. ఒక్కసారి షేడ్ నెట్ వేసుకుంటే పదేళ్ల వరకు ఉపయోగపడుతుందన్నారు. షేడ్ నెట్ 13 సెంట్లలో 21 మీటర్లు వెడల్పు, 25 మీటర్లు పొడవు, 4 మీటర్లు ఎత్తు ఉంటుందన్నారు. టమాటా, మిరప, క్యాప్సికమ్, పుచ్చకాయలు, కూరగాయలు, పండ్ల తోటలు, పూల తోటలను ఇందులో పెంచవచ్చన్నారు. యూనిట్ ధర రూ.3,22,800 కాగా, రైతు రూ.1,61,400 తన వాటాధనంగా ఖర్చు చేయాలన్నారు. హార్టికల్చర్ శాఖ నుంచి రూ.1,61,400లు సబ్సిడీ రూపంలో అందిస్తామన్నారు. మహిళా రైతులకు బ్యాంకు రుణాన్ని అందిస్తామన్నారు. గ్రామ సంఘ సహాయకురాలకు ఈ నెల 11న మండల స్థాయిలో పీ4 యాప్‌పై శిక్షణ ఇచ్చి యాప్ నమోదు చెయ్యాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కె.శచీదేవి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎం.ఎ.రహీమ్, జిల్లా బిందు సేద్యం పథక సంచాలకురాలు జి.వి.లక్ష్మి, ఏపీఎంలు, ఉద్యానవన అధికారులు పాల్గొన్నారు.