
రాజ్యాంగం ప్రజలందరినీ ఐక్యం చేస్తుంది
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోడ రఘురామ్
మద్దిలపాలెం: రాజ్యాంగం దేశ ప్రజలందరినీ ఐక్యం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ(భోపాల్) మాజీ డైరెక్టర్ జస్టిస్ గోడ రఘురామ్ తెలిపారు. ఏయూలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ న్యాయ కళాశాలలో గురువారం జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఎండోమెంట్ లెక్చర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టం, సామాజిక క్రమం రాజ్యాంగ దృక్పథం అనే అంశంపై ఉపన్యసించారు. ప్రజలు తమను తాము పాలించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నవే చట్టాలని తెలిపారు. నిత్యం కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు విభిన్న అంశాలపై అవగాహన అందించేందుకు ఇలాంటి సదస్సులు ఉపయోగపడతాయన్నారు. ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ శతాబ్ది సంవత్సరంలో ఉన్న ఏయూ ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను నిర్వహించేలా క్యాలెండర్‌ను విడుదల చేసిందన్నారు. ఇందులో మొదటిదైన ఈ కార్యక్రమం ఏర్పాటు పట్ల ఆనందం వ్యక్తం చేశారు. లా కాలేజ్ ప్రిన్సిపాల్ ఆచార్య కె.సీతామాణిక్యం న్యాయ కళాశాల ప్రత్యేకతలను, ఎండోమెంట్ లెక్చర్ వివరాలు వివరించారు. ముందుగా న్యాయ కళాశాల వద్దనున్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పించారు. అనంతరం అక్కడ పలు పండ్ల మొక్కలను నాటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతిని పురస్కరించుకొని న్యాయ కళాశాలలో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో విశ్రాంత ఆచార్యులు, ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.