
సుగర్ ఫ్యాక్టరీపై చంద్రబాబు,లోకేష్ హామీ గాలికి..
● సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న
దేవరాపల్లి: గోవాడ సుగర్ ఫాక్టరీ ఆధునికీకరణపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు ఎన్నికల సమయంలో కె.కోటపాడు మండలం గొండుపాలెం సభలో అధికారంలోకి వస్తే గోవాడ సుగర్ ఫ్యాక్టరీని ఆధునికీకరించి ఆదుకుంటామని హామీ ఇచ్చి ఏడాది దాటిపోతున్నా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. బుచ్చెయ్యపేట మండలం వడ్డాది వద్ద యువగళం బహిరంగ సభలో నారా లోకేష్ సైతం ఫ్యాక్టరీని ఆదుకుంటామని హామీ ఇచ్చి గాలికి వదిలేశారని ఆరోపించారు. ఫ్యాక్టరీపై 24 వేల మంది సభ్య రైతులు, వెయ్యి మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఫ్యాక్టరీని మూత వేయాలని చూస్తే అధికార కూటమికి రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఒకప్పుడు సీజన్‌కు 5 లక్షల టన్నులకు పైగా క్రషింగ్ జరగగా, గత సీజన్‌లో లక్షా 9వేల టన్నులు మాత్రమే క్రషింగ్ జరిగిందన్నారు. 2024–2025 సీజన్‌లో చెరుకు సరఫరా చేసిన రైతులకు 15 రోజులకే రూ. 3వేలు చొప్పున పేమెంట్లు చేసేవారని, ప్రస్తుతం రైతులు, కార్మికులకు రూ. 30 కోట్లు మేర బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఫ్యాక్టరీ మనుగడ కోసం కూటమి పార్టీల నాయకులు ఎందుకు నోరు మెదపకపోవడం లేదని ప్రశ్నించారు.