గోవుల అక్రమ రవాణా గుట్టు రట్టు చేయడంతోనే దుండగుల దాడి
సాక్షి, అనకాపల్లి/కోటవురట్ల : సామాజిక కార్యకర్త ఎస్.వి.ఎ.ఎస్.ఎస్.నూకరాజుపై ముగ్గురు వ్యక్తులు హత్యాయత్నం చేశారు. ఈ మేరకు బాధితుడు నూకరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గొర్ల దేముళ్లు, సంపెంగి నానాజీతోపాటు మరో యువకుడు గురువారం మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరంలోని నూకరాజు ఇంటికి వెళ్లి పథకం ప్రకారం హత్య చేయడానికి ప్రయత్నించారు. కుర్చీలు, కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టి తీవ్రంగా గాయపరిచారు.
‘మా మీదే ఫిర్యాదు చేస్తావా.. మాతోనే పెట్టుకుంటావా.. నిన్ను బతకనిస్తామా’ అంటూ ఇష్టానుసారంగా దాడి చేశారు. ఎంత బతిమాలినా వినకుండా తీవ్రంగా కొట్టడంతో సొమ్మసిల్లిపడిపోయాడు. వెంటనే ఆ ముగ్గురు నూకరాజుకు చెందిన రెండు సెల్‌ఫోన్లు, డెస్క్‌టాప్, సీసీ కెమెరా యూనిట్ పట్టుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై వెంటనే ఎస్‌ఐ విభీషణరావుకు ఫిర్యాదు చేయగా ఇంటికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. సీఐ రామకృష్ణారావు బాధితుడిని నక్కపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
గోవుల అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసినందుకు..
నూకరాజు మాట్లాడుతూ మండలంలోని పలు సమస్యల పరిష్కారం కోసం పలువురు వ్యక్తులు తన వద్దకు వస్తుంటారని, వాటి పరిష్కారంలో చొరవ చూపినందుకు తనపై పలువురు కక్ష కట్టినట్టు తెలిపారు. ఇటీవల గోవుల అక్రమ రవాణాకు సంబంధించి గుట్టు రట్టు చేయడంతో గొర్ల దేముళ్లు అనే రౌడీషీటర్ తనపై కక్ష కట్టినట్టు చెప్పారు. గొర్ల దేముళ్లు గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో అక్రమాలకు పాల్పడుతూ ఆవులను సంరక్షిస్తున్నట్టు చెప్పి, తన వద్ద ఉన్న గోదాములో ఉంచి ఆపై విక్రయాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. ఇదే విషయమై తాను గతంలో లోకాయుక్త, జిల్లా కలెక్టర్, ఎస్పీ, తహసీల్దారులతోపాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.
అంతేకాకుండా సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీ, అదనపు డీజీపీ, ఇంటిలిజెన్స్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై ఇటీవల ‘సాక్షి’లో ‘రక్షకులు కాదు గో భక్షకులు’ శీర్షికతో కథనం వెలువడిన విషయం తెలిసిందే. దీంతోపాటు డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ అనకాపల్లి ఎస్పీకి ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు. దీంతో గొర్ల దేముళ్లు తనను హతమార్చేందుకు పథకం రచించినట్టు సామాజిక కార్యకర్త నూకరాజు తెలిపారు. మున్ముందు కూడా తనకు ప్రాణహాని ఉందని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. హత్యాయత్నంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టీడీపీ నాయకుల అండతో గూండాగిరి
టీడీపీ నాయకుల అనుయాయుల దందాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. హోం మంత్రి వంగలపూడి అనితకు సన్నిహితుడిగా పేరున్న గొర్ల దేముళ్లు తన అనుచరులతో సామాజిక కార్యకర్త నూకరాజుపై హత్యాయత్నం చేయడం సంచలనం కలిగించింది. టీడీపీ నాయకుల భూఆక్రమణలు, అక్రమాలను ఆయన అడ్డుకుంటున్నారు. పాలకులు, అధికారులు, న్యాయమూర్తులకు ఫిర్యాదు చేస్తూ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. బాధితలకు అండగా నిలుస్తున్నాడు. అదే అక్రమార్కులకు కంటగింపుగా మారింది. గురువారం మధ్యాహ్నం జరిగిన దాడి ప్లాన్ ప్రకారం అడ్డు తొలగించాలన్న లక్ష్యంతోనే జరిగిందని అందరూ భావిస్తున్నారు.