
చేనేత కళాకారులకు చేయూత
● కలెక్టర్ విజయ్ కృష్ణన్
చేనేత కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్న కలెక్టర్ విజయ్ కృష్ణన్
అచ్యుతాపురం రూరల్: చేనేత కళాకారులను అన్ని విధాలా ఆదుకుంటామని కలెక్టర్ విజయ్ కృష్ణన్ అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అచ్యుతాపురం మండలంలోని దుప్పితూరు శ్రీ భద్రావతీ చేనేత సహకార సంఘం సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అచ్యుతాపురం మండల కాంప్లెక్స్‌లో ఉన్న సొసైటీని సందర్శించి అక్కడ తయారవుతున్న యోగా కార్పెట్స్, నవ్వారు తయారీ విషయమై చేనేతలను అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికులు వారి సమస్యలను కలెక్టర్‌కు వివరించగా.. అతి త్వరలో వారికి అవసరమైన ముడి సరకులు అందించి, క్లస్టర్ తరహాలో షెడ్ల నిర్మాణానికి భూమి కేటాయించి నిర్మాణాలు చేపడతామని, అక్కడే వృత్తి పనులు చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వర్రావు మాట్లాడుతూ 1947లో స్థాపించిన నాటి నుండి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సంఘాన్ని ఒక క్రమ పద్ధతిలో ముందుకు తీసుకువెళ్లిన మేనేజర్ మాడెం అప్పారావును అభినందించారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ పాల్గొన్నారు.