
విద్యాశక్తి కార్యక్రమం బహిష్కరణ
విద్యాశక్తి పథకాన్ని బహిష్కరిస్తున్నట్లు వినతిపత్రం అందజేస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు
అనకాపల్లి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యాశక్తి కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు బహిష్కరించారు. ఈ మేరకు స్థానిక డీఈవో కార్యాలయంలో సూపరింటెండెంట్ పార్వతికి లేఖ అందజేశారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా చైర్మన్ బోయిన చిన్నారావు, డిప్యూటీ కార్యదర్శి గొంది చిన్నబాయ్‌లు మాట్లాడుతూ విద్యాశక్తి కార్యక్రమం వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రూపొందించిన పాఠాలు బోధిస్తుండగా అవే పాఠ్యాంశాలను సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఆన్‌లైన్‌లో ప్రసారం చేయడం వల్ల సమయం వృథా తప్ప ఎటువంటి ఉపయోగం లేదన్నారు. ఆన్‌లైన్ ప్రసారంలో క్వాలిటీ లేకపోవడం, బోధన అంతా తెలుగు మీడియంలో జరగడం, కొన్ని ప్రాంతాల్లో కరెంట్ పోవడం వంటి సంఘటనలతో ఈ విద్యాశక్తి కార్యక్రమం సక్రమంగా సాగడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సిరికి దుర్గాప్రసాద్, ఆచంట రవి, వత్ససాయి శ్రీలక్ష్మి, సీహెచ్ నాగేశ్వరావు, డి.ఎస్. మల్లేశ్వరావు, కరుణ జ్యోతి పాల్గొన్నారు.