
యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు
● చోడవరం మండలంలో రాత్రికి రాత్రే కొండలు కనుమరుగు ● పట్టించుకోని రెవెన్యూ, మైన్స్ అధికారులు
చోడవరం: అక్రమ తవ్వకాలతో మండలంలో కొండలు పిండవుతున్నాయి. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఎవరికి తోచినంత వారు కొండలను యథేచ్ఛగా తవ్వేసుకుంటున్నారు. ముద్దుర్తి, నర్సాపురం, రాయపురాజుపేట, గోవాడ, అడ్డూరు, గంధవరం, బెన్నవోలు, ఖండిపల్లి, వెంకన్నపాలెం, ఎం.కొత్తపల్లి, దుడ్డుపాలెం గ్రామాల పరిధిలో ఉన్న కొండల్లో అక్రమ మెటల్ క్వారీలు నడుస్తున్నాయి. దోచుకున్న వారికి దోచుకున్నంతగా కొండలను కొల్లకొడుతున్నారు. వాస్తవానికి ఎర్రమెటల్ తవ్వకాలు, రవాణా చేయాలంటే ముందుగా రెవెన్యూ, మైన్స్ శాఖల అనుమతి పొందాల్సి ఉంది. చోడవరం మండలంలో మాత్రం అవేమీ లేవు. స్థానిక అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో తవ్వేసుకొని తరలించుకుపోతున్నారు. పొక్లెయిన్ల సాయంతో ఎక్కడికక్కడ కొండలను తవ్వేసి లారీలు, ట్రాక్టర్లతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి సమయాల్లో ఎక్కువగా ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. దీనికి స్థానిక అధికార పార్టీ నాయకుల సహకారం కూడా ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మకై ్క ఈ దందా నడుస్తున్నట్టు తెలిసింది. గంథవరం, అడ్డూరు, ముద్దుర్తి, నర్సాపురం, వెంకన్నపాలెం గ్రామాల్లో రియల్టర్లు పక్కనే ఉన్న కొండల నుంచి ఎర్ర మెటల్, మట్టిని తవ్వేసి తమ భూములను ఎత్తుచేసి ప్లాట్లు వేసి అమ్ముతున్నారు.
ఇందుకు స్థానిక వీఆర్వోలు సహకారం అందిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్ శాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పలు గ్రామాల్లో టాస్క్‌ఫోర్స్ బృందాలంటూ మొక్కుబడిగా కమిటీలు వేసినా అవి నామమాత్రంగానే ఉన్నాయి. ఇలా అనుమతి లేకుండా కొండలను తవ్వేసుకోవడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాక పోగా.. పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా మైన్స్, రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.