
ఫార్మసిస్టు వైద్యుడి అవతారం
యలమంచిలి రూరల్ : పెనుగొల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్న సుబ్బారావు యలమంచిలి పట్టణం శేషుగెడ్డ వద్ద నిర్వహిస్తున్న ప్రైవేటు ఆస్పత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఫార్మసిస్టు సుబ్బారావు ఇక్కడ ప్రైవేటుగా ఆస్పత్రి నిర్వహించడంతో పాటు రోగులకు వైద్యం అందిస్తున్నట్టు, ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న ఔషధాలను కూడా ఈ ఆస్పత్రిలో వైద్యం కోసం వినియోగిస్తున్నట్టు అధికారులు గుర్తించి విస్తుబోయారు. గత నెల 23న సాక్షిలో ‘అర్హత లేని వైద్యులు..గాల్లో ప్రాణాలు’ శీర్షికన జిల్లాలో అనుమతి లేని ఆస్పత్రులు, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మసిస్టులుగా పనిచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వైద్యుల అవతారం ఎత్తి, అర్హత లేని వైద్యం చేస్తున్న వైనంపై కథనం ప్రచురితమైంది. యలమంచిలి మండలం జంపపాలెంకు చెందిన ఆర్టీఐ యాక్టివిస్టు చాకలి నూకరాజు పెనుగొల్లు ప్రభుత్వ ఫార్మసిస్టు సుబ్బారావు యలమంచిలిలో ప్రైవేటుగా ఆస్పత్రి నిర్వహిస్తున్న విషయంపై జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్‌కు ఇటీవల పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ఎం.హైమావతి ఇద్దరు అధికారులు, ఇద్దరు సిబ్బందితో విచారణ బృందాన్ని నియమించారు. ఆ బృందం బుధవారం రాత్రి యలమంచిలి వచ్చి ఫార్మసిస్టు సుబ్బారావు పట్టణంలో నిర్వహిస్తున్న ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు తనిఖీకి వెళ్లిన సమయంలో ఫార్మసిస్టు సుబ్బారావు ఇద్దరు రోగులకు సైలెన్ ఎక్కిస్తున్నారు. ఆస్పత్రిలో మరొక గదిలో ప్రభుత్వం సరఫరా చేసిన ఔషధాలు పట్టుబడ్డాయి. వాటిలో మాత్రలు, ఇంజెక్షన్లు వంటివి ఉన్నాయి. వాటిని సీజ్ చేసిన అధికారులు ఫార్మసిస్టు సుబ్బారావు నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. తాను వైద్యం చేస్తున్నట్టు సుబ్బారావు రాతపూర్వకంగా వాంగ్మూలంలో అంగీకరించారు. దీనిపై నివేదికను డీఎంహెచ్‌వోకు అందజేస్తామని తనిఖీకి వచ్చిన అధికారులు తెలిపారు. ఈ తనిఖీలు యలమంచిలిలో సంచలనం కలిగించాయి.
ప్రభుత్వం సరఫరా చేసిన మందులతో
పెనుగొల్లు ఫార్మసిస్టు ప్రైవేటు ప్రాక్టీసు
సాక్షి కథనంతో విచారణకు
ఆదేశించిన జిల్లా కలెక్టర్
అధికారుల ఆకస్మిక తనిఖీలు
ఆస్పత్రిలో ప్రభుత్వం సరఫరా చేసిన మందుల గుర్తింపు

ఫార్మసిస్టు వైద్యుడి అవతారం