
ఏయూలో క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సు ప్రారంభం
మద్దిలపాలెం : బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌లో క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సును ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ బుధవారం ప్రారంభించారు. అనంతరం కోర్సుకి సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కోర్సును అందిస్తున్న తొలి ప్రభుత్వ విశ్వవిద్యాలయంగా ఏయూ నిలుస్తుందని చెప్పారు. అదేవిధంగా నేషనల్ క్వాంటమ్ మిషన్‌ను జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు. దీనికి సంబంధించి ఏయూలో ప్రత్యేక ల్యాబ్, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అందుకోసం పలు ప్రతిపాదనలు సిద్ధం చేసి దరఖాస్తు చేశామని చెప్పారు. తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ కోర్సుకి అవసరమైన వ్యవస్థను నిర్మించే దిశగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ కోర్సులో చేరిన విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలోకి వచ్చే సమయానికి క్వాంటమ్ రంగంలోని సంస్థలతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ రంగంలో ఆచార్యులను నిపుణులుగా తీర్చిదిద్దడానికి త్వరలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు తెలిపారు. విభిన్న విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశ్రమల నిపుణులు ప్రత్యక్షంగా పాల్గొని ఆచార్యులకు శిక్షణ అందిస్తారని తెలిపారు.