
గంజాయితో ఇద్దరి అరెస్టు
అనకాపల్లి టౌన్ : అక్రమంగా తరలిస్తున్న 107 కేజీల గంజాయి, 200 రూపాయలు నగదును స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ శ్రావణి తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు తెలిపారు. ముంచింగ్‌పుట్టు గ్రామానికి చెందిన బాలు(16) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తూ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. కిలగాడ గ్రామంలో నివాసముంటున్న గతంలో గంజాయి రవాణా చేసే ఒక వ్యక్తితో పరిచయం చేసుకొని గంజాయి రవాణా ద్వారా డబ్బు సంపాదించాలని భావించాడు. ఇందుకు తన స్నేహితుడు కిముడు నవదీప్ (16)ను కూడా కలుపుకొన్నాడు. ముగ్గురూ కలిసి ఒడిశాలోని కోడిగండి గ్రామం నుంచి గంజాయితో పాడేరు మీదుగా అనకాపల్లి బయలుదేరారు. మార్గమధ్యంలో అనకాపల్లి మండలంలోని కుంచంగి గ్రామం వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా, గమనించిన కిలగాడకు చెందిన వ్యక్తి ఆటో దిగి పారిపోయాడు. పోలీసులు ఆటోలో ఉన్న గంజాయితో పాటు ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు. పరారైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీఎస్పీ తెలిపారు. ఎస్‌ఐ రవికుమార్, సిబ్బందిని ఆమె అభినందించారు.