
చదువుల తల్లికి సత్కారం
● ఐఏఎస్‌కు ఎంపికై న డాక్టర్ మానస ● మునగపాక అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు రాక ● ఘనంగా సన్మానించిన గ్రామస్తులు
మునగపాక: కృషి, పట్టుదల ఉంటే రాణించగలమని నిరూపించారు. వైద్యురాలిగా సేవలందిస్తూనే ఐఏఎస్ కావాలన్న తన లక్ష్యాన్ని సాధించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ ఘనత సాధించిన రావాడ సాయి మానస మంగళవారం మునగపాక వచ్చారు. తన ఇష్ట దైవమైన ఇక్కడి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. శ్రీకాకుళానికి చెందిన రావాడ సాయి మానస విశాఖలో ఉంటున్నారు. ఆమె ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి విశాఖలోని చినవాల్తేరులో వైద్యాధికారిగా సేవలందిస్తున్నారు. ఐఏఎస్ కావాలన్నది ఆమె కోరిక. మూడేళ్లపాటు శ్రమించి సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశారు. ఇటీవల విడుదలైన యూపీఎస్‌సీ పరీక్ష ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించి, ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. మానస శిక్షణ కోసం డెహ్రాడూన్ వెళ్లనున్నారు. అంతకు ముందు మునగపాకలోని అయ్యప్పస్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు తల్లిదండ్రులతో కలిసి మంగళవారం ఆలయానికి వచ్చారు. వేదపండితులు సోమశేఖరశర్మ ఆశీస్సులు తీసుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అయ్యప్పస్వామి ఆలయ కమిటీ పెద్దలు మానసను ఘనంగా సత్కరించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్‌తోపాటు తల్లిదండ్రులు ప్రకాష్, ఉషారాణిల ప్రోత్సాహం మరువలేనిదన్నారు. ఆరోగ్య శాఖ కార్యదర్శిగా సేవలందించాలన్నది తన కోరిక అని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మొల్లేటి సరళ, కమిటీ సభ్యులు మొల్లేటి సత్యనారాయణ, పెంటకోట ఉమేష్, ఆడారి కాశీబాబు, జల్లేపల్లి కిష్టప్ప, వెలగా రామకృష్ణ, కాండ్రేగుల జగ్గారావు, పొన్నా కిరణ్, పూసర్ల వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.