
నాడు వ్యతిరేకించి.. స్మార్ట్‌మీటర్లను ఎలా బిగిస్తారు?
● వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకుల ధర్నా
అనకాపల్లి: వైఎస్సార్‌సీపీ పాలనలో స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలుగొట్టాలన్న మంత్రి నారా లోకేష్ ఇప్పుడు వాటిని ఇళ్లకు బిగించడం ముమ్మాటికీ మోసం చేయడమేనని వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు గంటా శ్రీరామ్, వై.ఎన్.భద్రం, ఎం.రాములు విమర్శించారు. స్థానిక గవరపాలెంలో విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద వామ పక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంట్లో దోపిడీకి ఆస్కారం కలిగించే విధంగా అదానీ విద్యుత్ స్మార్ట్‌మీటర్లను బిగించి ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అదానీ సంస్థకు స్మార్ట్‌మీటర్ల టెండర్లను కట్టబెట్టి భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు రూ.10 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతుందన్నారు. విద్యుత్ భారాలను తగ్గిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, అధికారం చేపట్టిన ఏడాదిలోనే ప్రజలపై రూ.15,485 కోట్ల సర్దుబాటు చార్జీలను పెంచడం అన్యాయమన్నారు. మీటర్లకు అయ్యే ఖర్చు రూ.10 నుంచి రూ.17 వేల వరకు దశలవారీగా వినియోగదారులపై మోపడం మరింత దారుణమన్నారు. అధిక విద్యుత్ వినియోగించే సమయాల్లో అధిక రేట్లు నిర్ణయించి వసూలు చేస్తున్నారన్నారు. ప్రీపెయిడ్ మీటర్ల వల్ల అందరిపై అధిక భారం పడుతుందన్నారు. అదానీ స్మార్ట్‌మీటర్లు, సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసే వరకూ పోరాటాలు చేస్తామని, పాత రీడింగ్ పద్ధతినే కొనసాగించాలన్నారు. వామ పక్షాలు, ప్రజా సంఘాల నాయకులు పెంటకోట శ్రీనివాసరావు, బొప్పే ఉమామహేశ్వరరావు, కాళ్ల తేలయ్యబాబు, జి. సుభాషిణి, కోరుబిల్లి శంకరరావు, కొణతాల హరనాథ్‌బాబు, భీశెట్టి అప్పారావు, కాపుశెట్టి అప్పారావు, టి.సురేష్ పాల్గొన్నారు.