
మునగపాక పీఎస్‌ను సందర్శించిన ఎస్పీ సిన్హా
మునగపాక: మునగపాక పోలీసు స్టేషన్‌ను మంగళవారం అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో కొంతసేపు తమకు కేటాయించిన విధుల తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సైబర్ నేరాలను నిరోధించేందుకు ఎప్పటికప్పుడు ప్రజలకు, యువతకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పూడిమడక రోడ్డులో అధిక లోడుతో వెళ్తున్న వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటు అతి వేగాన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి మెయిన్‌రోడ్డుకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇసుక డ్రమ్‌లు ఏర్పాటు చేసేలా చూడాలని ఆదేశించామన్నారు.
రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలని సూచించారు. గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాల జోలికి పోకుండా ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. యలమంచిలి సీఐ ధనుంజయరావు, ఎస్‌ఐ పి.ప్రసాదరావు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.