
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి వినతి
ఆర్డీవో కార్యాలయంలో ఏవో శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేస్తున్న జర్నలిస్టులు
అనకాపల్లి: ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని ప్రెస్‌క్లబ్‌ల పరిధిలోని జర్నలిస్టులు డిమాండ్స్ డే నిర్వహించారు. అందులో భాగంగా అనకాపల్లి ఆర్డీవో కార్యాలయంలో ఏవో శ్రీనివాసరావుకు ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు, అనకాపల్లి ప్రెస్‌క్లబ్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మంగళవారం తమ సమస్యలు పరిష్కరించమని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మద్దాల రాంబాబు, జిల్లా అధ్యక్షుడు పెంటకోట జోగినాయుడు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి ఆళ్ల వెంకట అప్పారావు, అనకాపల్లి ప్రెస్‌క్లబ్ కార్యదర్శి భీమరశెట్టి గణేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చాగంటి సర్వారావు (అవ్వ) తదితరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని నెరవేర్చాలని, జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ల విషయంలో న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీలలో జర్నలిస్టుల యూనియనన్‌కు ప్రాతినిథ్యం కల్పించాలని, వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ మరింత ప్రయోజనకరంగా ఇవ్వాలని, ప్రమాద బీమా పథకాన్ని తక్షణం పునరుద్ధరించాలని, ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీని తక్షణమే అమలు చేయాలని, విశ్రాంత పాత్రికేయులకు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పెన్షన్ పథకాన్ని మన రాష్ట్రంలో కూడా ప్రారంభించాలని కోరారు.