
విలువ దక్కేనా?
జనాభీష్టానికి
ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీపై
కొనసాగుతున్న ఆందోళనలు
బల్క్‌డ్రగ్ పార్క్ కోసం నివాస ప్రాంతాలు కోల్పోతున్న నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పూర్తి స్థాయిలో ఇవ్వలేదని నిర్వాసితులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. 2014 భూసేకరణ సమయంలో నిర్వాసిత కుటుంబాల్లో పెళ్లి కాని ఆడ, మగ పిల్లలకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు పెళ్లయిన ఆడపిల్లలకు ప్యాకేజీ ఇవ్వడం లేదంటూ ఆందోళన చేస్తున్నారు.
నిర్వాసితులకు అండగా వైఎస్సార్‌సీపీ, సీపీఎం
బాధిత రైతాంగానికి వైఎస్సార్‌సీపీ, సీపీఎంలతోపాటు, పలు ప్రజాసంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఆందోళనకారులను, వారికి సంఘీభావం ప్రకటించే నాయకులను ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేసే అవకాశాలు కలిపిస్తున్నాయి. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాభిప్రాయసేకరణను అడ్డుకుంటామని, తమ నిరసన తెలియజేస్తామంటూ మత్స్యకారులు నాయకులు చెబుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది.
ఏపీఐఐసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ బల్క్‌డ్రగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు దీన్ని ఏర్పాటు చేయనున్నారు. మందుల పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు తయారు చేసే యూనిట్లు ఇక్కడ నెలకొల్పుతారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2 వేల ఎకరాలను కేటాయించింది. ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం 1270 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. క్రియాశీల ఔషధ పదార్ధాలు (ఏపిఐలు), ముఖ్యప్రారంభ పదార్ధాలు (కేఎస్‌ఎంలు), రసాయన సంకలనం, ఔషధ సూత్రీకరణ వంటి కార్యకలాపాలు ఇక్కడ నిర్వహిస్తారు. ఈ కంపెనీకి రోజుకు 44.96 మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతుంది. 20.59 మిలియన్ లీటర్ల నీటిని ఏలేరు కాలువ నుంచి పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తారు. మరో 24.37 మిలియన్ లీటర్ల నీటిని రీసైక్లింగ్ ద్వారా ఉపయోగించుకుంటారు. ఈ పార్క్ నుంచి రోజుకు 25.36 మిలియన్ లీటర్ల పారిశ్రామిక వ్యర్థ జలం, 0.67 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఉత్పత్తి అవుతాయి. దీనికనుగుణంగా 24.24 మిలియన్ లీటర్ల సామర్ధ్యం కలిగిన శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. రూ.24 కోట్ల వ్యయంతో జాతీయరహదారి కాగిత నుంచి తమ్మయ్యపేట వరకు 4 కిలోమీటర్ల డబుల్ రోడ్డు నిర్మిస్తున్నారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బల్క్‌డ్రగ్ పార్క్ మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1100 కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీరు, వాడుక నీరు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించే పనులు గడచిన మూడు నెలల నుంచి చురుగ్గా జరుగుతున్నాయి. గుల్లిపాడు రైల్వేస్టేషన్ నుంచి 9.6 కిలోమీటర్ల రైల్వేలైను కూడా ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. 184 ఎకరాల్లో గ్రీనరీ ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ దశలో 750 మందికి, కార్యకలాపాల దశలో 17 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఏపీఐఐసీ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి కార్యకలాపాలు ప్రారంభమయిన తర్వాత 25 వేల మందికి ఉపాధి కలుగుతుందని చెబుతున్నారు.
1270 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు

విలువ దక్కేనా?