గొర్రెల మంద పంపకాల్లో వివాదం
కశింకోట: గొర్రెల మంద పంపకాల విషయమై ఇరువర్గాల మధ్య ఏర్పడిన వివాదంలో వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మండలంలోని ఉగ్గినపాలెంలో కలకలం రేపింది. సీఐ అల్లు స్వామినాయుడు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం... గొర్రెల మంద పంపకాల విషయమై గ్రామానికి చెందిన పక్కుర్తి అప్పలనాయుడు (65), కుమారుడు, అతని తమ్ముడుకు ఒమ్మి నూకరాజు, కుమారుడు ఒమ్మి శ్రీను మధ్య ఆదివారం వివాదం ఏర్పడింది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చింది. దాంతో రాత్రి 9.30 గంటల సమయంలో కోపోద్రిక్తులైన నిందితులు నూకరాజు, శ్రీను అప్పలనాయుడుపై కర్రలతో దాడి చేశారు. కింద పడవేసి కాళ్లతో పొట్ట భాగంలో తొక్కుతూ తీవ్రంగా గాయపర్చారు. అయితే కొన ఊపిరితో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు అక్కడ వైద్యుడు ధ్రువీకరించారు. ఈ మేరకు అందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయడానికి గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఉగ్గినపాలెంలో వృద్ధుడి దారుణ హత్య


