
వైద్య సిబ్బంది సాహసం
దేవరాపల్లి: ప్రజల ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకు దేవరాపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి ఇ.పూజ్య మేఘన శుక్రవారం రాత్రి పెద్ద సాహసం చేశారు. గిరిజన జనాభాతోపాటు శివారు గ్రామాలున్న వాలాబు పంచాయతీలో 45 ఏళ్ల లోపు వయసు వారిలో ఎంత మందికి సికిల్ సెల్ వ్యాధి ఉందో సర్వే చేయాల్సి ఉంది. ఏ ఊరు వెళ్లినా గిరిజనులు ఉండకపోవడంతో ఈ సర్వేకు ఆటంకం కలుగుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన వైద్యాధికారి పూజ్య మేఘన సర్వే పూర్తి చేయాలన్న సంకల్పంతో గిరిజనులు అందుబాటులో ఉండే రాత్రి పూట శుక్రవారం నాడు అటవీ ప్రాంతమైన వాలాబుకు పయనమయ్యారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లిన వైద్య సిబ్బంది అర్ధరాత్రి 12 గంటల వరకు అక్కడే ఉండి సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ వ్యాధి వలన కలిగే అనర్ధాలను గిరిజనులకు వివరించారు. కాగా రాత్రి పూట తమ ఇళ్లకు వైద్యాధికారి సిబ్బందితో కలిసి రావడంతో అడవి బిడ్డలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. డాక్టర్ పూజ్య మేఘనతోపాటు ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, హెల్త్ సూపర్‌వైజర్ పుష్పరాజ్ తదితరులు గ్రామానికి పాల్గొన్నారు. వారి అంకిత భావానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.
దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రయాణం
గిరిజన గ్రామాల్లో అర్ధరాత్రి వైద్య సేవలు