టీడీపీకి వరుస షాక్‌లు | - | Sakshi
Sakshi News home page

టీడీపీకి వరుస షాక్‌లు

Nov 3 2026 1:21 AM | Updated on Nov 3 2026 1:21 AM

వైఎస్సార్‌సీపీలోకి 55 కుటుంబాలు చేరిక

కోడిపుంజువలసలో 10,

డౌనూరులో 45 కుటుంబాలు..

చింతలపూడి స్వతంత్ర అభ్యర్థి సైతంవైఎస్సార్‌సీపీ తీర్థం

సాక్షి, పాడేరు: స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైఎస్సార్‌సీపీకి వలసలు పెరుగుతున్నాయి. అరకులోయ, కొయ్యూరు మండలాల్లో టీడీపీకి చెందిన కుటుంబాలతో పాటు స్వతంత్ర అభ్యర్థి సైతం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ నేతల సమక్షంలో కండువాలు కప్పుకుని వైఎస్సార్‌సీపీకి మద్దతు ప్రకటించారు.

కోడిపుంజువలసలో 10 కుటుంబాలు

అరకులోయ మండలం సిరగం పంచాయతీ కోడిపుంజువలసకు చెందిన టీడీపీ నేత కొర్రా భీమన్నతో పాటు 10 కుటుంబాల గిరిజనులు సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ఎస్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు సమక్షంలో పార్టీలో చేరారు. వారందరికీ చిన్నారావు కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ నెల 5న జరిగే స్థానిక ఎన్నికల్లో అరకు జెడ్పీటీసీ అభ్యర్థి కమ్మిడి అశోక్‌, ఎంపీటీసీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థి నాందెల శుక్రయ్య, మాజీ సర్పంచ్‌లు గుడివాడ ప్రకాశరావు, కె.జీనబందు, కిల్లో జగన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

డౌనూరులో 45 కుటుంబాలు

కొయ్యూరు: మండలంలోని డౌనూరు పంచాయతీ జోడుమామిడి, నిమ్మలపాలెం, తులబాలగెడ్డ గ్రామాలకు చెందిన 45 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. అరకు జెడ్పీటీసీ అభ్యర్థి గొడ్డేటి మాధవి సమక్షంలో వారు పార్టీలో చేరారు.పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి పనిచేయాలని మాధవి కోరారు.

స్వతంత్ర అభ్యర్థి చేరిక

చింతలపూడి ఎంపీటీసీ సెగ్మెంట్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న లీలావతి సోమవారం జెడ్పీటీసీ అభ్యర్థి గొడ్డేటి మాధవి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆమెకు మాధవి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చి వైఎస్సార్‌సీపీలో చేరినట్లు లీలావతి తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

శరభన్నపాలెంలో ప్రచార హోరు

మాధవి పెదమాకవరం, శరభన్నపాలెం సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర అధికార ప్రతినిధి నాగ మల్లేశ్వరి పాల్గొని, స్థానిక ఎన్నికల్లో టీడీపీ పాల్పడుతున్న హింసాకాండను ప్రజలకు వివరించారు. టీడీపీకి ఎందుకు ఓటు వేయకూడదో తెలియజేశారు. కొమ్మికలోనూ వైఎస్సార్‌సీపీ నేతలు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement