ముంచంగిపుట్టు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ముంచంగిపుట్టు మండల కేంద్రంలోని చెక్పోస్ట్ వద్ద సోమవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రయాణికుల బ్యాగులు, లగేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అనుమతిస్తున్నారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా తనిఖీలు నిర్వహిస్తూ అపరిచితులు, అనుమానితుల వివరాలను సేకరిస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.


