పెదబయలు: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం పెదబయలు వారపు సంతలో టీడీపీ, జనసేన కూటమి నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రభుత్వ విధుల్లో ఉన్నట్లు తెలిపే ‘ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’స్టిక్కర్ కలిగిన ఇనోవా వాహనం పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ 31 టీఎన్ 2859 నంబరు కలిగిన టయోటా ఇనోవాకు టీడీపీ జెండా కట్టి ప్రచార ర్యాలీలో తిప్పారు. వాహనం వెనుక భాగంలో ప్రభుత్వ విధుల్లో ఉన్నట్లు తెలిపే స్టిక్కర్ స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఎన్నికల ప్రచారానికి ఎలా వినియోగించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ లేదా అద్దె వాహనాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించడంపై నిబంధనలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత వాహనంపై ఎన్నికల అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


