● అడిషినల్ ఎస్పీ శృతి
సాక్షి, పాడేరు: జిల్లావ్యాప్తంగా ఈ నెల 21 నుంచి 23 వరకు నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా అదనపు ఎస్పీ వై.శృతి తెలిపారు. శుక్రవారం సాయంత్రం పాడేరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆమె విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు జిల్లావ్యాప్తంగా 64 జెడ్పీటీసీ, 823 ఎంపీటీసీ నామినేషన్లు దాఖలయ్యాయని వెల్లడించారు. ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రత్యేక పోలీసు బలగాలతో ఏరియా డామినేషన్ నిర్వహించామన్నారు. నామినేషన్ల దాఖలు, పరిశీలన సమయంలో అభ్యర్థులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే హెల్ప్‌డెస్క్ ద్వారా లేదా నేరుగా పోలీసు అధికారులను సంప్రదించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు చోటుచేసుకోకుండా వివిధ పార్టీలకు చెందిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పాడేరు డీఎస్పీ రాజసింహారెడ్డి, పాడేరు సీఐ రామారావు పాల్గొన్నారు.


