సాక్షి, పాడేరు/ముంచంగిపుట్టు/పెదబయలు: జిల్లాలోని ముంచంగిపుట్టు, పెదబయలు, పాడేరు, హుకుంపేట మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియతో పాటు స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లను శుక్రవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్ పరిశీలించారు. ముంచంగిపుట్టు ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ తీరును పరిశీలించి, ఆర్‌వో శ్రీనివాసరావుతో మాట్లాడి నామినేషన్ల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల–2లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఎంపీడీవో ధర్మారావుతో మాట్లాడి వసతులపై ఆరా తీశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పాడేరు ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి, నిర్వహణ తీరును సమీక్షించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్ల స్వీకరణ పారదర్శకంగా, సజావుగా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. పెదబయలులో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఆయన, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హుకుంపేటలోనూ నామినేషన్ల నిర్వహణ, ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్ మాట్లాడుతూ.. డిసెంబర్ 3వ తేదీ వరకు ఎన్నికలకు సంబంధించిన అంశాలపై జిల్లా ఎన్నికల పరిశీలకుడిని సంప్రదించవచ్చని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా సమస్యలు, ఫిర్యాదులు, సందేహాలు ఉంటే 9848743786 నంబర్‌కు ఫోన్ చేసి ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకోవాలని సూచించారు.
సూచనలిచ్చిన
జిల్లా పరిశీలకుడు కూర్మనాథ్


