● ఓపెన్ స్కూల్ అడ్మిషన్లపై అవగాహన
● పలు విద్యాసంస్థల్లో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్
● ఈ నెల 31 చివరి గడువు
● పదో తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలు
జి.మాడుగుల: చదువు మధ్యలో మానేసినవారు, పాఠశాలలు, కళాశాలల్లో చదివే అవకాశం లేనివారు ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా విద్యను కొనసాగించాలని అధికారులు పిలుపునిచ్చారు. ఏపీ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా శుక్రవారం జి.ఎం.కొత్తూరు గ్రామ సమీపంలోని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వేణుప్రసాద్ ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయ సిబ్బంది పలు విద్యాసంస్థలు, కార్యాలయాలను సందర్శించారు. అసిస్టెంట్ కమిషనర్ ఆర్.శశికుమార్ ఆదేశాల మేరకు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గురుకుల పాఠశాల స్టడీ సెంటర్లను పరిశీలించారు. జి.ఎం.కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌తో కలిసి మండల విద్యాశాఖ కార్యాలయం, సీఏహెచ్ (బి) స్కూల్, జీటీడబ్ల్యూఎస్ (బి) గాంధీనగరం పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, వెలుగు కార్యాలయం, సెర్ఫ్ వర్క్‌షాప్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జీసీసీ కార్యాలయాలను సందర్శించి ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. చదువుకు దూరమైనవారికి, మధ్యలో విద్యను నిలిపివేసినవారికి, పాఠశాలలు, కళాశాలల్లో చదివే అవకాశం లేని బాలబాలికలు, వయోజనులకు ఓపెన్ స్కూల్ ద్వారా విద్యను కొనసాగించే అవకాశం ఉందని అధికారులు వివరించారు. సెలవు దినాల్లో మాత్రమే తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతిలో చేరేందుకు చదవడం, రాయడం తెలిసి, 2026 ఆగస్టు 31 నాటికి 14 ఏళ్లు నిండినవారు అర్హులని పేర్కొన్నారు. ఓపెన్ ఇంటర్మీడియట్‌లో చేరేందుకు పదో తరగతి ఉత్తీర్ణులై, అదే తేదీ నాటికి 15 ఏళ్లు నిండినవారు అర్హులని తెలిపారు. అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 31 చివరి తేదీ అని వెల్లడించారు.


