వైఎస్సార్సీపీలో జోష్
డాబాగార్డెన్స్: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వరుదు కల్యాణి శనివారం అత్యంత కోలాహలంగా, భారీ జనసందోహం నడుమ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ శ్రేణుల నినాదాలు, భారీ కాన్వాయ్‌తో సాగిన ఈ నామినేషన్ కార్యక్రమం నగరంలో పండుగ వాతావరణాన్ని తలపించింది. ముందుగా వరుదు కల్యాణి పార్టీ కార్యాలయం నుంచి ముఖ్య నేతలతో కలిసి సంపత్ వినాయగర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డాబాగార్డెన్స్ ఎల్ఐసీ విగ్రహం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ఎల్ఐసీ, గుడివాడ గురునాథరావు విగ్రహ కూడలి, జీవీఎంసీ గాంధీ విగ్రహ పార్కు మీదుగా వేలాది మంది కార్యకర్తలతో కలిసి జీవీఎంసీకి చేరుకున్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన మేయర్ ఎన్నికల కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారితో కలిసి ఆమె తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
ముఖ్య నేతల హాజరు
కార్యక్రమంలో మాజీ ఎంపీ డాక్టర్ సత్యవతి, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, శోభా హైమావతి, మాజీ ఎమ్మెల్యే, పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూరావు, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్, మళ్ల విజయప్రసాద్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, బొత్స అనూష, తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, పార్టీ నాయకులు కొండా రాజీవ్‌గాంధీ, జాన్ వెస్లీ, రొంగలి జగన్నాథం, పేడాడ రమణకుమారి, సతీష్‌వర్మ, రవిరాజు, అంబటి శైలేష్, సినీనటుడు జోగినాయుడు, ఫరూఖీ, పీలా వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, సీని యర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నామినేషన్ కార్యక్రమాన్ని సందడిగా మార్చారు.
మీ ఇంటి ఆడపడుచుగా ఆశీర్వదించండి: వరుదు కల్యాణి
నామినేషన్ అనంతరం జీవీఎంసీ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరులతో కలిసి వరుదు కల్యాణి మాట్లాడారు. ‘జగనన్న ఆశీస్సులు, విశాఖ ప్రజల దీవెనలతో మేయర్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నన్ను గుర్తించి పెద్దపీట వేసిన జగనన్నకు కృతజ్ఞతలు. విశాఖ ప్రజల సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది. మీ ఇంటి ఆడపడుచుగా నన్ను భావించి, మేయర్‌గా నన్ను.. అలాగే 120 స్థానాల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను భారీ మెజారిటీతో గెలిపించాలి’ అని ఆమె విజ్ఞప్తి చేశారు. కూటమి పాలనలో విశాఖలో అభివృద్ధి మూలకు చేరిందని, ’సేల్ వైజాగ్’గా మారుతున్న నగరానికి రక్షణగా ’సేవ్ వైజాగ్’ నినాదంతో వైఎస్సార్సీపీ ముందుకు వెళ్తుందని ఆమె స్పష్టం చేశారు.


