గెలుపే గురి | - | Sakshi
Sakshi News home page

గెలుపే గురి

Oct 18 2026 2:00 AM | Updated on Oct 18 2026 2:00 AM

గిరిజన గడ్డపై

● స్థానిక సమరానికి వైఎస్సార్‌సీపీ సన్నద్ధం

● సమర్థులైన అభ్యర్థుల ఎంపికపై దృష్టి

● అన్ని స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా వ్యూహం

సాక్షి, పాడేరు : వైఎస్సార్‌సీపీ అంటే గిరిజనం.. గిరిజనం అంటే వైఎస్సార్‌సీపీ అన్నంతగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పార్టీకి ప్రజాదరణ ఉంది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానాన్ని గుండెల్లో నింపుకున్న గిరిజనులు ఆది నుంచి వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో స్థానిక ఎన్నికల సమరానికి పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై వైఎస్సార్‌సీపీలో జోష్‌ నెలకొంది. సమర్థులైన నాయకులను అభ్యర్థులుగా ఎంపిక చేసేందుకు పార్టీ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా చేపట్టి, అన్ని స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని భావిస్తోంది.

వైఎస్సార్‌సీపీకే పట్టం

2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో అరకు ఎంపీతోపాటు అరకు, పాడేరు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే, 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ మన్యం ఓటర్లు వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టారు. జిల్లాలోని 11 జెడ్పీటీసీ స్థానాలకు గాను పది స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి ముంచంగిపుట్టు జెడ్పీటీసీ జల్లిపల్లి సుభద్రకు దక్కింది. ఒక్క అనంతగిరి జెడ్పీటీసీ స్థానాన్ని మాత్రమే సీపీఎం గెలుచుకుంది. అలాగే, జిల్లాలోని 11 ఎంపీపీ స్థానాల్లో పది స్థానాలను వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకుంది. జి.మాడుగుల మండలంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ సమాన సంఖ్యలో ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోవడంతో, స్వతంత్ర అభ్యర్థికి టీడీపీ మద్దతు ఇవ్వడం ద్వారా ఆ మండలంలో ఎంపీపీ పదవిని దక్కించుకుంది. జిల్లాలో మొత్తం 244 గ్రామ పంచాయతీలు ఉండగా, అరకు నియోజకవర్గంలో 135, పాడేరు నియోజకవర్గంలో 109 ఉన్నాయి. వీటిలో అధిక శాతం సర్పంచ్‌ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ప్రాతినిధ్యం వహించడం గమనార్హం.

మెరుగైన పాలన.. గెలుపే లక్ష్యం

అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని పలు మండలాల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రజలకు మెరుగైన సేవలందించారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. మరోసారి స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు అరకు ఎంపీ డాక్టర్‌ గుమ్మా తనూజరాణి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. జిల్లాలోని 11 జెడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పార్టీ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. 2021 స్థానిక ఎన్నికల్లో సాధించిన విజయాలు, 2024 సార్వత్రిక ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా మన్యంలో పార్టీ పట్టు నిలబెట్టుకోవాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు భావిస్తున్నాయి. స్థానికంగా ప్రజాదరణ ఉన్న నాయకులకు ప్రాధాన్యమిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసి, ఎన్నికల బరిలో సత్తా చాటేందుకు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement