సాక్షి, విశాఖపట్నం: ‘కూటమి ప్రభుత్వం ‘సేల్ వైజాగ్’ దందాతో నగరాన్ని దోచుకుంటుంటే.. విశాఖను కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ ‘సేవ్ వైజాగ్’ నినాదంతో ప్రజా క్షేత్రంలోకి వెళ్తోందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు స్పష్టం చేశారు. జీవీఎంసీ కార్యాలయం ఎదుట మీడియా సమావేశంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు కూటమి పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వ అసమర్థత వల్లే విశాఖ నగర చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా తీవ్ర తాగునీటి ఎద్దడి తలెత్తిందని బొత్స సత్యనారాయణ, కన్నబాబు మండిపడ్డారు. ‘కూటమి వద్ద ధన బలం ఉంటే, వైఎస్సార్సీపీ వద్ద ప్రజల అపారమైన బలమే శ్రీరామరక్షగా ఉంది. గతంలో కుట్రలు చేసి బీసీ మేయర్ను పదవి నుంచి దించినా, మా నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలపై గౌరవంతో మళ్లీ బీసీ మహిళకే ప్రాధాన్యమిస్తూ వరుదు కళ్యాణిని బరిలోకి దింపారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన నభూతో నభవిష్యత్ అభివృద్ధిని చూపించి ప్రజలను తలెత్తుకుని ఓట్లు అడుగుతాం. అధికారం అంటే సంక్షేమాన్ని పక్కనపెట్టి భూములు దోచుకోవడం కాదు’ అని నేతలు హితవు పలికారు.


