శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా పాడేరులోని మహాలక్ష్మీదేవి అలంకరణలో పార్వతిదేవి, రాజరాజేశ్వరిదేవి, దేవితల్లి, అరకులోయలోని భ్రమరాంబదేవి
సాక్షి, పాడేరు: జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రి వేడుకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో శనివారం జిల్లాలోని అన్ని ఆలయాల్లో అమ్మవార్ల విగ్రహాలను మహాలక్ష్మిదేవిగా ప్రత్యేకంగా అలంకరించారు. మహాలక్ష్మి దేవిని భక్తులు దర్శించుకుని కుంకుమార్చన చేశారు. సంగోడి గ్రామంలో పార్వతీ సమేత సిద్ధి సంగమేశ్వర ఆలయంలో శరన్నవరాత్రులను ఈశ్వరీయ బ్రహ్మకుమారీలు ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు పూజా సామగ్రిని సంగోడి గ్రామంలో ఉరేగించారు. ఇక్కడ కొలువుదీరిన పార్వతీదేవి విగ్రహాన్ని మహాలక్ష్మిదేవిగా అలంకరించారు. బ్రహ్మకుమారీ విజయ ఆధ్వర్యంలో మహాలక్ష్మిదేవికి కుంకుమార్చన పూజలను గిరిజనులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రసాదాలను అందజేశారు. బ్రహ్మకుమారీలు శారద, శాంతి, సుమిత్ర తదితరులు పాల్గొన్నారు. పాడేరులోని ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయంలో రాజరాజేశ్వరిదేవిని మహాలక్ష్మిదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు.ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భారీ అన్న సమరాధన నిర్వహించారు. భవానీ భక్తులతో పాటు పట్టణంలోని ప్రజలు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు.
చింతపల్లి: మండల కేంద్రంలో రంగా సెంటర్, ఆనాదీశ్వర ఆలయం, సకలదేవతలు గుడి, లంబసింగి, బైలుకించంగి, రత్నగరి కాలనీ,చిలకల మామిడిలో దుర్గమ్మ మండపాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


