కె.కోటపాడు: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆ పార్టీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ పిలుపునిచ్చారు. మాజీ ఎంపీపీ, పార్టీ మండలాధ్యక్షుడు రెడ్డి జగన్మోహన్ అధ్యక్షతన శనివారం కె.కోటపాడులో నిర్వహించిన మండల కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ప్రజలకు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందాయని, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు హయాంలో మాడుగుల నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ విషయాలను ప్రజలకు వివరించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో మాజీ ఎంపీపీ రెడ్డి జగన్మోహన్, మండల వైఎస్సార్సీపీ యువజన విబాగం అద్యక్షుడు గొర్రుపోటు వెంకటరావు, బండారు ముత్యాలనాయుడు, ఆదిరెడ్డి రామునాయుడు, వేచలపు దొరబాబు, జాగరపు వెంకట రామలక్ష్మి, నెక్కల గోపి, చీపురపల్లి అచ్చిబాబు, రొంగలి వెంకటరమణ, బోళెం కృష్ణారావు, లెక్కల గోపి, నెక్కల పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిక
కొరువాడ గ్రామానికి చెందిన మాజీ పీఎంసీ కమిటీ చైర్మన్ చిటిమిరెడ్డి అప్పారావు శనివారం టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. ఈర్లె అనురాధ, రెడ్డి జగన్మోహన్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అనురాధ సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చీపురపల్లి అచ్చిబాబు, రంధి రాజునాయుడు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.


