కరువు చాయలు | - | Sakshi
Sakshi News home page

కరువు చాయలు

Oct 3 2026 2:14 AM | Updated on Oct 3 2026 2:14 AM

అరకులో

అందాల అరకులోయలో వర్షాభావం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సాగునీరు అందక ఎంతో కష్టపడి వేసిన నారుమడులు కళ్లముందే ఎండిపోతుండటంతో... వందలాది ఎకరాల్లో వరినాట్లు పడక రైతన్నలు దిక్కుతోచని స్థితిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, పాడేరు: అందాల అరకులోయలో ఖరీఫ్లో పచ్చని పంటలతో కళకళలాడాల్సిన వ్యవసాయ భూములు వర్షాభావం కారణంగా నేడు బీడు భూములుగా మారాయి. ఎంతో ఉత్సాహంగా వేసిన నారుమడులు కళ్లముందే ఎండిపోతుండటంతో గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

– పట్టణ పరిధిలోని పెదలబుడు, చినలబుడు, మాడగడ పంచాయతీల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 500 ఎకరాల్లో వరినాట్లు పడని దుస్థితి ఏర్పడింది. ప్రతిఏటా పచ్చని రంగులద్దినట్లు కనిపించే ఈ ప్రాంతం, ఈ ఏడాది వర్షాలు లేక ’క్రాప్‌ హాలిడే’ ప్రకటించినట్లు కనిపిస్తోంది. పచ్చదానానికి నిలయమైన అరకులోయలో వ్యవసాయం నిలిచిపోవడంతో ఇటు రైతులు, అటు పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎండిపోతున్న నారుమడులు

ఖరీఫ్‌ వ్యవసాయం పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ఏడాది జూలైలో నారుమడులు వేసినప్పటికీ విస్తారంగా వర్షాలు కురవలేదు. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లోనూ ఈ మూడు పంచాయతీల పరిధిలో తగిన వర్షపాతం నమోదుకాకపోవడంతో సాగునీరు అందక నారుమడులు ముదిరిపోయి ఎండిపోతున్నాయి. శరభగుడ, లిచ్చిగుడ, బోసుబేడ తదితర గ్రామాల పరిధిలో వరినాట్లు వేయడానికి చుక్కనీరు కూడా లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయారు.

తిండి గింజలకు ఇబ్బందే

ఖరీఫ్‌ సాగు పూర్తిగా దెబ్బతినడంతో ఈ ఏడాది తిండిగింజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని గిరిజన రైతులు వాపోతున్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినా, ఈ భూములకు మాత్రం సరిపడా నీరు అందలేదు.

● ఈ ఏడాది జూన్‌లో 149 మిల్లీమీటర్లకు గాను 31 మిల్లీమీటర్లు, జూలైలో 236 మిల్లీమీటర్లకు 118 మిల్లీమీటర్లు, ఆగస్టులో 209 మిల్లీమీటర్లకు 106 మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌లో కొంత వర్షం కురిసినా అది లోతట్టు ప్రాంతాలకే పరిమితం కావడంతో నారుమడులను కాపాడుకోలేకపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాగునీటికి అవస్థలు

సాగునీరు అందక ఖరీఫ్‌ వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. నారు పోసినా, వర్షాలు అనుకూలంగా లేకపోవడంతో సమయానికి వరి నాట్లు వేయలేకపోయాం. ఖరీఫ్‌ సాగు భూములన్నీ బీడులుగా మారుతుండటం ఎంతో బాధిస్తోంది. వరి సాగుకు దూరమైన రైతులమంతా ఈ ఏడాది తిండిగింజలకు కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. – పడాల బిస్నాద్‌, రైతు, బోసుబెడ

వెంటాడుతున్న వర్షాభావం

సాగునీరందక ఎండిపోతున్ననారుమడులు

బీడుభూములుగా దర్శనం

దిక్కుతోచని స్థితిలో గిరి రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement