● విశేష అలంకరణల్లోధారాలమ్మ, మారెమ్మ తల్లి
● దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులు
శాకాంబరి అలంకరణలో ధారాలమ్మతల్లి, సీలేరులో మారెమ్మతల్లి
ఆషాఢ మాసం తొలి శుక్రవారం
సందర్భంగా సీలేరు ప్రాంతంలోని ప్రాచీన ధారాలమ్మ తల్లి, శ్రీ మారెమ్మ అమ్మవార్ల ఆలయాల్లో శాకాంబరి అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కూరగాయలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవార్లను దర్శించేందుకు తెలుగు రాష్ట్రాలనుంచి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
సీలేరు: మన్యంలో దశాబ్దాల కాలంగా విరాజిల్లుతున్న ప్రాచీన ప్రాముఖ్యత కలిగిన ఘాట్ రోడ్డు ధారాలమ్మ తల్లి, ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్స్ విద్యుత్ వెలుగుల కొంగుబంగారం శ్రీ మారెమ్మ అమ్మవార్లకు ఆషాఢ మాసం తొలి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర దినాన ఇద్దరు అక్కాచెల్లెళ్లు శాకాంబరి దేవిగా ప్రత్యేక అలంకరణలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.
సర్వాంగ సుందరంగా..
అంతర్రాష్ట్ర భక్తుల ఆరాధ్య దైవంగా కొలవబడుతున్న ధారాలమ్మ తల్లికి, దారకొండ గ్రామానికి చెందిన అనుములశెట్టి శ్రీనివాసరావు,లక్ష్మి దంపతులు, అలాగే పోలవరం జిల్లాకు చెందిన చిన్న లోవ దంపతులు వివిధ రకాల తాజా కూరగాయలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
భక్తిశ్రద్ధలతో సారె..
అదేవిధంగా సీలేరు గ్రామ దేవత, పలు రాష్ట్రాల భక్తుల కొంగుబంగారమైన శ్రీ మారెమ్మ అమ్మవారిని శాకాంబరి దేవిగా స్థానికులు పందిరి చిన్న లూసి, బండారు వెంకటేశ్ ఆధ్వర్యంలో కూరగాయలతో సుందరంగా అలంకరించారు. ఏపీ జెన్‌కో ఏఈగా విధులు నిర్వహిస్తున్న జైపాల్ నివాసం నుంచి గ్రామానికి చెందిన మహిళా భక్తులందరూ పెద్ద ఎత్తున కాలినడకన అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సారె సమర్పించారు.
బారులు తీరిన భక్తులు
అమ్మవార్ల దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు బారులు తీరారు. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా గ్రామంలో నక్క జ్ఞానేశ్వర్‌రావు నిర్వహించిన వారాహి నవరాత్రుల పూజలు ముగియడంతో, భక్తులందరికీ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవాలతో సీలేరు ప్రాంతం అంతా ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.


