సాక్షి, పాడేరు: ఏజెన్సీలో మిరియాలు, సుగంధ ద్రవ్యాల పంటల సాగు విస్తరణతో పాటు గిరిజన రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లాలో స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర స్పైసెస్ బోర్డు సభ్యుడు కేవీ సుబ్బారావు తెలిపారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం అరకులోయ, పాడేరు, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లోని పలు గ్రామాలను ఆయన సందర్శించారు. కాఫీ తోటల్లో అంతర పంటగా సాగవుతున్న మిరియాల తోటలను పరిశీలించి గిరిజన రైతులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్పైసెస్ బోర్డు ద్వారా గిరిజన రైతులకు నిచ్చెనలు, కల్లాలు, టార్పాలిన్లు తదితర అవసరమైన పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా పర్యటనలో సేకరించిన వివరాల ఆధారంగా సమగ్ర నివేదిక రూపొందించి కేరళలోని స్పైసెస్ బోర్డు ప్రధాన కార్యాలయానికి పంపనున్నట్లు చెప్పారు. ఏజెన్సీలో మిరియాలు, అల్లం, పసుపు వంటి సుగంధ ద్రవ్యాల సాగు విస్తరణతో పాటు దిగుబడులు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ను మర్యాదపూరర్వకంగా కలిశారు. స్పైసెస్ బోర్డు విస్తరణ కార్యక్రమాలపై సమీక్షించారు. బోర్డు విస్తరణాధికారి కల్యాణి పాల్గొన్నారు.
ఆ సంస్థ సభ్యుడు కేవీ సుబ్బారావు


