జీసీసీ, ఐటీడీఏ పెట్రోల్‌ బంక్‌ల్లో వెట్టి చాకిరీ | - | Sakshi
Sakshi News home page

జీసీసీ, ఐటీడీఏ పెట్రోల్‌ బంక్‌ల్లో వెట్టి చాకిరీ

Jul 25 2026 12:29 AM | Updated on Jul 25 2026 12:29 AM

ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడుఅమర్‌ విమర్శ

కార్మికులకు తక్షణమే వేతనాలుపెంచాలని డిమాండ్‌

పాడేరు రూరల్‌: పాడేరు ఐటీడీఏ పరిధిలోని జీసీసీ, ఐటీడీఏ పెట్రోల్‌ బంకుల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రధాన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అమర్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం వివిధ మండలాల పరిధిలోని జీసీసీ, ఐటీడీఏ పెట్రోల్‌ బంకుల వద్ద విధులు నిర్వహిస్తున్న కార్మికులతో కలిసి ఆయన నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, అరకొర వేతనాలతో కార్మికులు వెట్టిచాకిరీ చేస్తున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగినా, వాటికి అనుగుణంగా వేతనాలు పెంచకుండా యాజమాన్యం కార్మికులను తీవ్రంగా దోపిడీ చేస్తోందని ఆరోపించారు. కార్మికులకు కనీసం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేదన్నారు. గత పదేళ్లుగా కొందరు కార్మికులు అదే పెట్రోల్‌ బంకుల్లో పనిచేస్తున్నప్పటికీ, వారికి ఇప్పటికీ అరకొర వేతనాలే చెల్లిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం ప్రకారం ఒక్కో కార్మికుడికి నెలకు రూ.26 వేల వేతనం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాల కారణంగా ప్రస్తుతం ఉన్న 8 గంటల పనిని 12 గంటలకు పెంచుతూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. యాజమాన్యం వెంటనే చొరవ తీసుకుని పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించడంతో పాటు, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలని కోరారు. అలాగే కార్మికుల ప్రధాన డిమాండ్లన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పెట్రోల్‌ బంకు కార్మికుల సంఘ ప్రతినిధులు రాజాబాబు, బుజ్జిబాబు, వెంకటేష్‌, కర్రిబాబు, మాధవి, కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement