అరకులోయ టౌన్: విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో స్నేహపూర్వక సంబంధాలు పెంపొందించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సూచించారు. శుక్రవారం స్థానిక స్పోర్ట్స్ స్కూల్‌లో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం పాఠశాలలో ఉపాధ్యాయులతోనే గడుపుతారని అన్నారు. అందువల్ల విద్యార్థుల చదువు, నడవడిక, మానసిక పరిస్థితిలో వచ్చే మార్పులను తల్లిదండ్రుల కంటే ముందుగా ఉపాధ్యాయులే గుర్తించగలరని పేర్కొన్నారు. అందుకే విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ పిల్లల విద్యాభివృద్ధిపై నిరంతరం చర్చించాలన్నారు. ఇటీవల కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలియకుండా పాఠశాలలు విడిచి వెళ్లిపోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా విద్యార్థులకు మంచి నడవడిక, క్రమశిక్షణ, విలువలు అలవర్చే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులిద్దరిపైనా ఉందన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పోర్ట్స్ స్కూల్‌తో పాటు కంఠబౌంశుగూడ, యండపల్లివలస బాలికల ఆశ్రమ పాఠశాలల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మూర్తి, ఎంపీటీసీ స్వాబి రామ్‌చందర్, అరకులోయ, డుంబ్రిగూడ మండలాల పార్టీ అధ్యక్షులు స్వాబి రామూర్తి, పాంగి పరశురామ్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు కమిడి అశోక్‌కుమార్, జన్ని నరసింహమూర్తి, కిల్లో జగన్‌కుమార్, పాంగి నరసింగరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులకు
ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సూచన


